UPI Scam : చార్జ్ బ్యాక్ ఆప్షన్ తో రూ.4 కోట్లు కొట్టేశారు.. 13 మంది అరెస్ట్

బజాజ్ ఎలక్ట్రానిక్స్ టార్గెట్ గా యూపీఐ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ.4కోట్ల మేర యూపీఐ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సైబరాబాద్ డీసీపీ నరసింహా తెలిపారు. సోమవారం ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈ యూపీఐ మోసాల వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది. ముందుగా ముఠా సభ్యులు వస్తువులు కొనడానికి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌కి వెళ్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు. చెల్లింపులు చేయడానికి బజాజ్ షోరూమ్‌లోని క్యూఆర్ కోడ్‌ను రాజస్థాన్‌లోని సహచరులకు పంపుతారు. అక్కడి నుంచి క్యూఆర్ కోడ్‌తో డబ్బులు పంపిస్తారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున వేరే అకౌంట్ కు డబ్బు బదిలీ చేశామంటూ చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ఈ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. గత రెండు నెలలుగా 1,125 యూపీఐ లావాదేవీలు జరిపినట్లు గుర్తించాం. ఈ ముఠాకు చెందిన వారిలో హైదరాబాద్‌కు చెందిన 13 మందిని అదుపులోకి తీసుకున్నాం. రాజస్థాన్‌కు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నాం. ఈ మోసాల వెనుకున్న ప్రధాన నిందితుడిని పట్టుకుంటాం’ అని డీసీపీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com