ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుపతికి వెళ్లి తిరిగొస్తూ..
దేవుడిని దర్శించుకుని తిరిగొస్తున్న వారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు.. ఎదురుగా వస్తున్న లారీ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లా కొండాపురం వద్ద చోటు చేసుకుంది.
మరో అరగంటలో వారి స్వగ్రామం చేరుకుంటామనగా ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి , వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు, కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన బంధువులంతా కలిసి ఈ నెల 13న తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకుని, పలు ప్రాంతాలను చూసి ఆదివారం రాత్రి 9గంటలకు తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. చిత్రావతి వంతెన వద్ద సోమవారం తెల్లవారు జామున ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో డ్రైవరుతో సహా ఐదు కుటుంబాలకు చెందిన వ్యక్తుల జీవితాలు ఛిన్నా భిన్నం అయ్యాయి.
వాహనంలో ప్రయాణిస్తున్న తాడిపత్రికి చెందిన వెంకటలక్ష్మి, వార్డు వాలంటీరు సునీల్ కుమార్ రెడ్డి, డ్రైవర్ భూమిరెడ్డి, బళ్లారికి చెందిన సుభద్ర, ఆమె కుమారుడు నితిన్ రెడ్డి, లక్ష్మీదేవి, జమ్మలమడుగుకు చెందిన సుమలత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వెంకటలక్ష్మి, సుమలత, లక్ష్మీదేవి, సుభద్ర నలుగురూ అక్కచెల్లెళ్లు.
వీరి మరో సోదరి జయలక్ష్మి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అదే వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మేఘన, శిల్పల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలకు వైద్య పరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com