East Godavari : ఒక ఆటోలో 18 మందిని ఎక్కించిన డ్రైవర్.. అవాక్కయిన పోలీసులు

East Godavari : సాధారణంగా ఒక ఆటోలో నలుగురు లేదా ఆరుగురిని ఎక్కిస్తారు. కొంత మంది కాస్త ఇబ్బందయినా డబ్బుల కక్కుర్తితో 8 మంది వరకు ఎక్కిస్తారు. కానీ.. తూర్పు గోదావరి జిల్లా మాధవపట్నంలో ఓ ఆటోవాలా తీరు.. పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా 18 మందిని ఒకే ఆటోలో ఎక్కించి తీసుకెళ్తున్న అతన్ని చూసి నోరెళ్లబెట్టారు. నిన్న చెకింగ్స్ సందర్భంగా ఈ ఆటో డ్రైవర్ ఇలా ఓవర్ లోడ్‌తో వెళ్తూ పోలీసులకు చిక్కాడు.
కాకినాడ నుంచి వీళ్లంతా ఆటోలో సామర్లకోట బయలుదేరారు. అక్కడ భీమేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా అట్నుంచి అటే పెద్దాపురం మరిడమ్మ వారి దర్శన కోసం వెళ్లాలనుకున్నారు. ఇంత మందిని తీసుకెళ్తున్నందుకు మంచి బేరం కుదుర్చుకునే ఆటో డ్రైవర్ బయలుదేరాడు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారని చెప్పుకొచ్చాడు. అనూహ్యంగా చెకింగ్స్‌లో దొరికేయడంతో బిక్కమొహం వేశాడు.
కాసుల కక్కుర్తితో ఏకంగా 18 మందిని ఆటోలో కుక్కినందుకు.. అతనిపై కేసు నమోదు చేశారు. అలాగే.. డబ్బులు మిగులుతాయని ఇలా ప్రమాదకరమైన ప్రయాణానికి సిద్ధమైన ఆ కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com