Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా గ్యాంగ్ ప్లాన్!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హత్యకు మరో క్రిమినల్ ముఠా బంబిహా నాయకుడు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. తన గ్యాంగ్ పలుకుబడిని పెంచుకోవడానికే బిష్ణోయ్‌ను అడ్డం తొలగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బంబిహా ముఠా నాయకుడు కుశాల్ చౌధ్రీ తన అనుచరుడు పవన్ షూకీన్ అలియాస్ సోనూతో కలిసి ఓ పథకం పన్నినట్లు ఆంగ్లపత్రిక ఇండియాటుడే పేర్కొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న పవన్ ఇద్దరు షార్ప్ షూటర్లను పురమాయించి అక్టోబర్ 26న దిల్లీ రాణీబాగ్‌లోని ఓ వ్యాపారవేత్త ఇంటివద్ద రెక్కీ నిర్వహించి కాల్పులు జరిపించాడట. అనంతరం అతడిని రూ.15 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేకపోతే మరణం తప్పదని హెచ్చరించడంతో.. ఆ వ్యాపారవేత్త కూడా డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యాడట. ఈలోపు ఇద్దరు షార్ప్ షూటర్లను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సెమీ ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. వీరిని విచారించగా.. లారెన్స్‌ను చంపేందుకు దిల్లీ జైల్లో ఉన్న కుశాల్ చౌధ్రీ ప్లాన్ చేస్తున్నట్లు తేలింది. దీనిలోభాగంగా డబ్బులు సమీకరించేందుకే ఆ వ్యాపారవేత్తను బెదిరించినట్లు గుర్తించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com