Nellore : బైక్స్ దొంగతనం.. ఇద్దరు అరెస్టు

నెల్లూరు జిల్లా నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 18లక్షల విలువ చేసే 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని నాయుడుపేట అర్భన్ సీఐ బాబి తెలియజేశారు. నాయుడుపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మోటార్ సైకిల్ చోరీ దొంగల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరీపై అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీనివాసపురం ప్రాంతంలో ఇద్దరు యువకులు అనుమానస్పదంగా సంచరిస్తుండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యులుగా గుర్తించడం జరిగిందన్నారు. పట్టుబడిన వారు పట్టణంలోని అమరాగార్డెన్‌కు చెందిన సమీఉల్లా, తమిళనాడు ప్రాంతానికి చెందిన అర్జున్‌లుగా గుర్తించడం జరిగిందన్నారు. వీరి వద్ద నుంచి 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ చోరీలలో మరో నిందితుడిగా ఉన్న తమిళనాడు ప్రాంతానికి చెందిన రమేష్ పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహన దారులు తమ వాహనాల పట్ల జాగ్రత్తలు పాటించి చోరీల నియంత్రణకు సహకరించాలన్నారు. ముఖ్యంగా వీల్ లాక్‌ను వినియోగించడం ద్వారా చోరీలను కొంత వరకు నియంత్రించ వచ్చునని తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com