Private bus : ప్రైవేటు బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మథురలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ ప్రైవేటు బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 8 గంటలకు బస్సును వెనుక నుండి వేగంగా వస్తోన్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఫిరోజాబాద్‌లోని షికోహాబాద్‌కు చెందిన ఒక బాధితుడిని గుర్తించారు.
ఇతర మృతుల వివరాలను సేకరిస్తున్నామని, వారు ఎక్కడి నుంచి వస్తున్నారని, కారులో ఎలా మంటలు చెలరేగాయనే దానిపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని మధుర పోలీసు ప్రతినిధి తెలిపారు. బస్సు బీహార్‌లోని గయా నుంచి ఢిల్లీ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. "బస్సులో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. వారు సురక్షితంగా బయటికి దూకారు. అయితే, కారులో కూర్చున్న వారు దాని తలుపులు లాక్ కావడంతో బయటకు రాలేకపోయారు" అని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com