Fraud : చిట్టీల పేరుతో రూ.120 కోట్లు ఎగరేసుకుపోయిన మోసగాడు

రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను చిట్టీ నిర్వహకుడు నిండా ముంచి పరారయ్యాడు. రెండు వేల మంది నుంచి రూ.120 కోట్లకు పైగా సొమ్ము వసూలు చేసి రాత్రికి రాత్రి ఉడాయించిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 25 ఏళ్ల కిందట నగరానికి వలసవచ్చారు. ఈక్రమంలో ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని బీకే గూడ రవీంద్ర నగర్ కాలనీ సమీపాన సీ-టైపు కాలనీలో నివాసముంటున్నారు. పుల్లయ్య పెద్దగా చదువుకోక పోవడంతో దాదాపు మూడేళ్ల పాటు నగరంలోని పలు ప్రాంతాలలో అడ్డా కూలీగా పనిచేశాడు. బీకే గూడలో స్థానికులతో పరిచయాలు పెంచుకొని చిన్నపాటి చిట్టీలను నిర్వహించాడు. చిట్టీలలో ఆదాయం రావడంతో కూలి పని మానేసి 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారాన్ని విస్తరించాడు. కూలీలు, మధ్య తరగతి కుంటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూ.1లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలను నిర్వహించాడు. నగరానికి వచ్చిన తొలినాళ్లలో గుడిసెల్లో నివాసమున్న పుల్లయ్య కాలక్రమంలో అదే కాలనీలో ఐదంతస్థుల భవనం నిర్మించుకున్నాడు. అలా.. 2వేల మందితో చిట్టీ వేయించి ఏకంగా రూ.120కోట్ల సొమ్ముతో రాత్రికి రాత్రి పారిపోయాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com