Ananthapuram: సంచలనం రేపుతున్న CI ఆత్మహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య సంచలనం సృష్టిస్తుంది. ఇవాళ తెల్లవారుజామున ఇంట్లోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆనందరావు గత 10 నెలలుగా తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సీపీఐ కాలనీలోని అద్దె ఇంట్లో ఆయన కుటుంబం నివాసముంటోంది. కుటుంబసభ్యులు నిద్రపోయిన తర్వాత ఇంట్లోనే సీఐ ఉరివేసుకున్నారు. గత మూడునెలలుగా పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. సీఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి. సీఐకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్ల లేక కుటుంబ కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆనందరావు ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సీఐ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబంలో కలహాలు ఉన్నాయని, నిన్న రాత్రి గొడవ జరిగిందన్నారు. ఎలాంటి పని ఒత్తిడి లేదని.. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అయితే ఎస్పీ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా సీఐ ఆనందరావు పెద్ద కూతురు భవ్య వర్షన్ ఉంది. కేవలం పని ఒత్తిడితోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదన్నారు. తాడిపత్రిలో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందని హ్యాండిల్ చేయలేకపోతున్నానంటూ తరచూ తన తండ్రి బాధపడ్డారని భవ్య వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com