Congress Youth Leader : కాంగ్రెస్ యువనేత అనుమానాస్పద రీతిలో మృతి

మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మరణించడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అతని కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా భావించారు. సోమవారం రాత్రి (జూలై 14, 2025) మెదక్ నుంచి తన స్వగ్రామానికి కారులో వెళ్తుండగా, చిన్నఘనపూర్ విద్యుత్ ఉపకేంద్రం వద్ద అతని కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అనిల్‌కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు గమనించి మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, తరువాత పోలీసులు అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలను గుర్తించారు. అతని కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే, ఘటనాస్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో ఇది కేవలం రోడ్డు ప్రమాదం కాదని, హత్యా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. మారెల్లి అనిల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం. మొదట రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు, బుల్లెట్ గాయాలను గుర్తించిన తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అనిల్ ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఈ సంఘటన కాంగ్రెస్ వర్గాల్లో, ముఖ్యంగా మెదక్ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అనిల్ మృతికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com