Cricket Betting Conspiracy : హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ కుట్ర

ఐపీఎల్ మ్యాచ్ లలో హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున క్రికెట్ బెట్టింగ్ కుట్ర జరిగినట్లు బీసీసీఐ ముందస్తుగా గుర్తించింది. హైదరాబాద్ కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నిస్తున్నాడని, దీనిపై అన్ని ఐపీఎల్ జట్లను అప్రమత్తం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లు, కోచ్ లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ గుర్తించింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తకు బుకీలతో పాటు బెట్టింగ్ సిండికేట్లతో సంబంధాలు ఉన్నాయని బీసీసీఐ దృష్టికి వచ్చింది. సామాన్య అభిమానిగా క్రికెటర్లను పరిచయం చేసుకుంటూ వారికి ఖరీదైన బహుమతులు, ఆభరణాలు, లగ్జరీ సౌకర్యాలతో ఆటగాళ్లు, కోచ్లు, సిబ్బందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎన్ఎస్ఎ్యూ విచారణలో తేలింది. ముఖ్యంగా ఐపీఎల్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులను, జట్టు యజమానులను, విదేశాల్లో నివసిస్తున్న వారి బంధువులను కూడా సోషల్ మీడియా ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించింది. సదరు వ్యాపార వేత్తతో ఎలాంటి సంబంధం ఉన్నా వెంటనే తమ ఇంటిగ్రిటీ అధికారులకు రిపోర్ట్ చేయాలని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com