Cyber Fraud : కరెంట్ బిల్లుల పేరిట సైబర్ చీటింగ్

సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా కరెంట్ బిల్స్ పేరిట కాల్స్, మెసేజ్లు, ఫేక్ లింక్స్ పంపిస్తూ వారి ఖాతాలలోని మొత్తాలను లూటీ చేస్తున్నారు. కరెంట్ బిల్ పెండింగ్లో ఉందని.. బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని మెసేజ్ లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో విద్యుత్ వినియోగదారులకు, కరెంట్ బిల్ కట్టని వారికి 8967954941నెంబర్ తో వాట్సప్ మెస్సేజ్ లు పంపిస్తున్నారు. మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేస్తామంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. ఈరోజు రాత్రికి 7:30కి పవర్ కట్ చేయడం ఖాయమని సైబర్ మోసగాళ్లు భయపెడుతున్నారు. పవర్ కట్ చేయొద్దంటే వెంటనే 8135967194, 8135967194 నెంబర్స్ కు కాల్ చేయాలని మోసగాళ్లు మెస్సేజ్ లు పంపిస్తున్నారు. అలాగే బిల్ పేమెంట్ కోసం లింకులతో పాటు వీడియో కాల్స్ సైతం చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.
అయితే సైబర్ నేరగాళ్ల మోసాలపై అప్రమత్తమైన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక నెంబర్ ఎప్పుడు విద్యుత్ శాఖ మెస్సేజ్ పంపదని, అలాగే లింక్స్ సైతం పంపించరని విద్యుత్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు ఎవ్వరికీ ఇవ్వొద్దని టీజీఎస్ఓసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి సూచించారు. కరెంట్ బిల్లు చెల్లించాలంటూ వచ్చిన సందేశాల్లోని లింక్ను క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్లు చెల్లించాలని తెలిపారు. కరెంట్ బిల్లుల పేరిట వచ్చే సందేశాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com