Crime : కంకర వల్లే మృతుల సంఖ్య పెరిగిందా..?

చేవెళ్ల బస్సు ప్రమాదంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తెల్లవారు జామున కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన సమయంలోనే.. ఈ ప్రమాదం జరగడం దారుణం. 24 మంది ఇప్పటి వరకు చనిపోయారు. అయితే ఇందులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం లేదు. తప్పంతా టిప్పర్ డ్రైవర్ దే. కుడి వైపు నుంచి ఓవర్ స్పీడ్ గా వచ్చి ఢీ కొట్టాడు. కానీ ఢీ కొట్టిన సమయంలో కంకరతో ఓవర్ లోడ్ గా ఉంది టిప్పర్. ఇదే ప్రమాదంలో మృతుల సంఖ్యను పెంచింది. యాక్సిడెంట్ అయిన తర్వాత జేసీబీలతో టిప్పర్ ను తీయిస్తే.. బస్సులో 40 శాతం దాకా కంకరతో నిండిపోయింది. ఆ కంకర కిందే ఎక్కువ మంది సమాధి అయిపోయారు.
బస్సును ఢీ కొట్టిన వెంటనే టిప్పర్ బస్సు మీద బోల్తా పడింది. ఆ టిప్పర్ లో ఉన్న కంకర మొత్తం ప్యాసింజర్లను కప్పేసింది. బస్సు ఢీ కొని చాలా మంది గాయపడ్డారు కానీ చనిపోలేదు. కానీ ఎప్పుడైతే కంకర వాళ్ల మీద కమ్మేసిందో.. చాలా మంది ఊపిరాడక చనిపోయారని పోలీసుల ప్రాథమిక విచారణలో బయటకు వచ్చింది. కంకర ఓవర్ లోడ్ గా ఉండటమే ఇక్కడ మృతుల సంఖ్య పెరగడానికి కారణం అయింది. ఆ కంకరలో కూరుకుపోయి బయటకు రాలేక ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ కంకర లేకపోతే తీవ్ర గాయాలతో చాలా మంది బతికేవారేమో అంటున్నారు. ఈ స్థాయిలో ఓవర్ లోడ్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైగా హైవేపై గుంతలు ఉండటం, హైవే పూర్తిగా వంకర టింకరగా ఉండటం ఇంకో అంశం. ఇది రిట్జ్ హైవే. చాలా తక్కువ వెడల్పుతో, మలుపులు ఎక్కువగా ఉండటం వల్ల గతంలో ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ రోడ్డు మీద ఓ గుంతను తప్పించబోయి చివరకు బస్సును ఢీ కొట్టాడు. హైవే బాగా లేకపోవడం, టిప్పర్ ఓవర్ స్పీడ్ లో ఉండటం, కంకర ప్రయాణికుల మీద పడటం.. ప్రమాదానికి అతిపెద్ద కారణాలు. ఈ ప్రమాదంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ హైవేను డెవలప్ చేస్తారా.. ఇలాంటి టిప్పర్ లను ఓవర్ స్పీడ్ గా వెళ్లకుండా చర్యలు తీసుకుంటారా అన్నది చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

