Donald Trump : ఈ రాత్రే అమెరిరా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

Donald Trump : ఈ రాత్రే అమెరిరా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం
X

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధమైంది. వాషింగ్టన్ డీసీలో ఉన్న క్యాపిటల్‌ హిల్‌లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్​ ప్రమాణం చేయనున్నారు. భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ట్రంప్‌ ఇప్పటికే తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌ చేరుకున్నారు. అక్కడ 100 మంది ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దంపతులు పాల్గొన్నారు.

సాధారణంగా క్యాపిటల్‌ భవనం మెట్లపై అధ్యక్షులుగా ప్రమాణం చేస్తుంటారు. అయితే అతిశీతల వాతావరణం కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 25వేల మందితో ఫెడరల్ అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. తొలుత సెయింట్‌ జాన్స్‌ ఎపిస్కోపల్‌ చర్చిలో ట్రంప్‌ ప్రార్థనలు చేస్తారు. అక్కడి నుంచి వైట్‌ హౌస్‌కు వెళ్లి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే టీ పార్టీలో పాల్గొంటారు.

క్యాపిటల్‌ హిల్‌కు చేరుకుని భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్‌తో అధ్యక్షుడిగా ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం చేశాక ట్రంప్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు. అమెరికా యూనిటీ థీమ్‌గా ఆ ఉపన్యాసం ఉంటుందని ట్రంప్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్‌లో జరిగే విందులో పాల్గొంటారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రోజంతా సంగీత కార్యక్రమాలతో పాటు పరేడ్‌లను నిర్వహించనున్నారు.

Tags

Next Story