గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంటహత్యల కలకలం..!

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నాగార్జుననగర్‌లో నివాసముంటున్న పద్మావతి ఆమె కూతురు ప్రత్యూష దారుణహత్యకు గురయ్యారు. ఇంట్లోకి వచ్చిన దుండగుడు.. వారి ప్రాణాలు పోయే వరకూ కసితీరా చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పద్మావతి బంధువే.. మహిళలను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆస్తి, పొలం తగాదాలతోనే జంట హత్యలు జరిగినట్లు భావిస్తున్నారు. జంట హత్యలతో సత్తెనపల్లిలో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఆర్వోగా పనిచేసి రిటైర్ అయిన కోనూరు శివప్రసాద్ ఇటీవలే చనిపోయారు. ఆయనకు భార్య వెంకట సుగుణ పద్మావతి, కూతురు లక్ష్మీ ప్రత్యూష, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు గుంటూరు ఆర్టిఓ ఆఫీస్‌లో సీసీగా పని చేస్తున్నాడు. కూతురు పద్మావతికి ఇటీవలే పెళ్లైంది. శివ ప్రసాద్ భార్య, కూతురు 10వ వార్డులోని నాగార్జున నగరలో ఉంటున్నారు.
శనివారం రాత్రి ఏడు గంటల ఇరవై నిముషాలకు ఇంట్లో ఉన్న తల్లి, కూతురును కొడుకు వరస అయ్యే కోనూరు శ్రీనివాసరావు కత్తి నరికి చంపాడు. ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణమని తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. వివరాలు సేకరించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా..? హత్యకు కారణాలేంటనే దానిపై ముమ్మరంగా విచారిస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com