Drugs : మధ్యప్రదేశ్ నుంచి సిటీకి డ్రగ్స్
అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ ను రాచకొండ పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన ఓం రామ్, సన్వాలా రామ్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్‌కు చెందిన వికాస్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు. వీటిని హైదరాబాద్‌లో అమ్మేందుకు సిటీకి వచ్చారు. దీని గురించి ముందస్తు సమాచారం అందుకున్న జవహర్ నగర్, ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు సోమవారం ఓం రామ్, సన్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.45 లక్షల విలువైన గసగసాల గడ్డి, 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో ఓం రామ్ కార్పెంటర్ గా, సన్వాలా రామ్ రైలింగ్ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఓంరామ్ పై రాజస్థాన్ లో డ్రగ్స్ కేసులున్నాయన్నారు. ఈజీ మనీ కోసమే వీరిద్దరూ డ్రగ్స్ సప్లయర్లుగా మారినట్లు ఆయన తెలిపారు. నిందితులు ఇద్దరూ మధ్యప్రదేశ్ నుంచి బస్సులు, లారీలు, ట్రైన్లలో హైదరాబాద్ కు సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఓంరామ్, సన్వాలా రామ్ ను అరెస్ట్ చేసి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు చేశామన్నారు. మరో నిందితుడు వికాస్ పరారీలో ఉన్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com