Dogs Attack : కుక్కలదాడిలో వృద్ధురాలు మృతి

ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రిసేవాలాల్ తండా పరిధి లోని బట్టోని తాళ్లకు చెందిన పిట్ల రాజ్యాలక్ష్మి (85) అనే వృద్ధురాలిని కుక్కలు దాడి చేసి చంపివేయడంతోపాటు శరీరాన్ని సగం వరకు పీక్కుతిన్నాయి. దాడిలో వృద్దురాలి తల మొండెం వేరయ్యాయి. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉండగా, ఆమె కుమారులు పక్క ఇంట్లోనే వేరుగా ఉంటున్నారు.
రోజు వారిలాగే వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చిన తర్వాత వృద్ధురాలికి భోజనం పంపించి నిద్ర పోయారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై అర్ధరాత్రి కుక్కలు దాడి చేసి దారుణంగా చంపగా, ఉదయం కుమారులు గమనించారు. తెల్లవారేలోగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ గణేశ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి చెందడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో చిన్నారులపైనా కుక్కలు దాడి చేసినట్లు తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఊర కుక్కలను గ్రామంలో లేకుండా చేయాలని విన్నవిస్తున్నారు. కాగా, దాడి చేసిన వాటిలో ఓ కుక్కను గ్రామస్తులు చంపివేసినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com