Crime : కూతురు పై తండ్రి అఘాయిత్యం...విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు..

ఆడపిల్లలనుకంటిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే వారి పాలిట మృగాళ్లలా మారుతున్న ఘటనలు సమాజంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఐదేళ్ల కూతురి పట్ల పాశవికంగా ప్రవర్తించిన తండ్రి కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరణించేంత వరకూ జైల్లోనే ఉండాలని తీర్పులో పేర్కొంది. కాగా ఈ తరహా శిక్ష విధించడం చాలా అరుదుగా జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విశాఖపట్నంలోని జాలారిపేటలో నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 15న భార్యతో గొడవపడి, పిల్లలిద్దరినీ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి, ఫుల్లుగా మద్యం సేవించిన నిందితుడు, పిల్లలిద్దరినీ తగరపువలసలో ఉన్న ఒక పాత సినిమా హాల్ వద్ద ఉన్న రేకుల షెడ్డులో నిద్రపుచ్చాడు.
అర్థరాత్రి సమయంలో, ఐదేళ్ల కూతురు లేచి ఏడుస్తుండటంతో కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు...కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం...నిందితుడు మరణించేంత వరకూ జైల్లోనే ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో పాటు, బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల పరిహారం అందించాలని కోర్టు పేర్కొంది. కన్న తండ్రే మృగంలా మారిన ఈ దారుణ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com