ఫుడ్ డెలివరీ ఏజెంట్.. పెళ్లికి నో చెప్పిందని హత్య..

ఫుడ్ డెలివరీ ఏజెంట్.. పెళ్లికి నో చెప్పిందని హత్య..
మూడు ముళ్ల బంధం మూణ్ణాళ్లతో ముగిసేది కాదు.. ఒకరిని ఒకరు ఇష్టపడాలి.. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాలి.

మూడు ముళ్ల బంధం మూణ్ణాళ్లతో ముగిసేది కాదు.. ఒకరిని ఒకరు ఇష్టపడాలి.. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాలి. అన్నిటికీ మించి ఆర్థిక స్థోమతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. మంచి ఉద్యోగం.. ఆరంకెల జీతం అయితే వెంటనే ఓకే చెప్పేస్తుంటారు.. కానీ ఇక్కడ ఫుడ్ డెలివరీ ఉద్యోగం చెస్తున్నాడని అతడికి నో చెప్పింది. దూరపు బంధువు.. కోరి చేసుకుంటానంటున్నాడు.. అయినా ఆమె ససేమిరా అంది.. దాంతో ఆగ్రహం చెందిన అతడు పాపం ఆ యువతి నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు. కాపు కాచి హత్య చేశాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

ఇర్ఫాన్ మూడు రోజుల క్రితమే ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు, నర్గీస్ తన స్టెనోగ్రఫీ తరగతులకు వెళ్లేటప్పుడు ప్రతిరోజూ పార్క్ మీదుగా వెళుతుందని తెలుసుకున్నాడు.

నర్గీస్‌ ఈ ఏడాదే కమలా నెహ్రూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఇర్ఫాన్ తన బంధువు అయిన నర్గీస్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అతనికి సరైన ఉద్యోగం లేదు. ఖాళీగా ఉండడం ఎందుకని ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. నర్గీస్ ముందు ఇర్ఫాన్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా చాలీ చాలని జీతంతో ఎలా పోషిస్తావ్ అని అడిగింది. పర్మినెంట్ ఉద్యోగం లేనిదే పెళ్లి చేసుకోనంది. దాంతో అతడు నిరుత్సాహానికి గురయ్యాడు. మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. ఆమెనే జీవిత భాగస్వామిగా ఊహించుకున్నాడు.. ఆమె కాదనేసరికి తట్టుకోలేకపోయాడు.. కోపంతో ఊగిపోయాడు.. మాటు వేసి మట్టుపెట్టాడు.

ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినా నర్గీస్ మొహం చాటేసేది. దీంతో అవమానంగా భావించాడు ఇర్ఫాన్.. ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం ఉదయం ఢిల్లీ శ్రీ అరబిందో కాలేజీ సమీపంలోని పార్కులో ఇర్ఫాన్ నర్గీస్‌ను ఇనుప రాడ్‌తో కొట్టి చంపేశాడు. నేరం చేసిన కొన్ని గంటలకే ఇర్ఫాన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటన తర్వాత నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని తప్పుపట్టారు. కేంద్ర హోంమంత్రి మరియు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ఢిల్లీలో మరో యువతి దారుణ హత్యకు గురికావడం చాలా బాధాకరం.. ఢిల్లీలో శాంతిభద్రతలు తీవ్ర సమస్యగా మారాయి.. పోలీసులు కాస్త చురుగ్గా పనిచేయాలని హోంమంత్రికి విన్నపం.. యువతుల భద్రత ఢిల్లీకి, ఢిల్లీ ప్రజలకు చాలా ముఖ్యం’’ అని సీఎం ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story