Death Penalty: హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష

Death Penalty: హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
X
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు.. హాస్టల్‌లో 21 మంది బాలికలపై లైంగిక దాడి కేసులో తీర్పు


అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2014-2022 మధ్య కాలంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 21 మంది విద్యార్థులపై లైంగికదాడికి పాల్పడిన వార్డెన్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితులంతా మైనర్లేనని.. అందులో ఆరుగురు బాలురు కూడా ఉన్నారని సిట్‌ విచారణలో వెల్లడైంది. ఇదే కేసులో ప్రధానోపాధ్యాయుడు, హిందీ టీచర్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

అసలు ఏమైందంటే...

అరుణాచల్ ప్రదేశ్‌లోని షీ యోమీ జిల్లాలోని మోనిగోంగ్ పోలీస్ స్టేషన్‌లో 2022 నవంబర్‌లో ఒక కేసు ఫైల్ అయింది. స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివే 12 ఏళ్ల ఇద్దరు కవలలు.. హాస్టల్ వార్డెన్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని తండ్రికి చెప్పారు. దీంతో ఆ హాస్టల్ వార్డెన్‌ యుమ్కెన్ బాగ్రాపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ రెసిడెన్షియల్ హాస్టల్‌లో విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఇద్దరు కవలలతోనే కాకుండా హాస్టల్‌లో ఉండే ఇతర బాలికలపై ఆ వార్డెన్ లైంగిక దాడి చేసినట్లు గుర్తించారు.

సహకరించిన టీచర్లకు కూడా...

2014 నుంచి 2022 వరకు మొత్తం 21మంది బాలికలపై అతడు లైంగిక దాడులు, వేధింపులు పాల్పడినట్లు గుర్తించారు. ఇక అందులో ఆరుగురు బాలురు కూడా ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. ఆ బాలుర వయసు కూడా 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిందితుడు యుమ్కెన్ బాగ్రాపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. మరో ఇద్దరిపైనా అభియోగాలు మోపారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్ మాజీ ప్రిన్సిపల్, హిందీ మహిళా టీచర్‌‌లపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. తాజాగా పోక్సో స్పెషల్ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో యుమ్కెన్ బాగ్రాను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి మరణశిక్ష విధించింది. అంతేకాకుండా అతడికి సహకరించిన మరో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్షను తాజాగా ఖరారు చేసింది.

Tags

Next Story