Fraud in Singareni : సింగరేణిలో ఉద్యోగం పేరిట మోసం

సింగరేణిలో మహిళకు ఉద్యోగం పెట్టిస్తానని ఆమె భర్తను నమ్మించి ఐదు లక్షలు తీసుకుని మోసగించిన ఇద్దరు కేటు గాళ్లను మంచిర్యాల పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. కేసు వివరాలను సీఐ బన్సీలాల్ మీడియా సమావేశంలో వివరించారు. మంచిర్యాల కు చెందిన బేర నగేష్ కుమార్ అనే వ్యక్తికి సోమగుడెంకు చెందిన సింగరేణి ఉద్యోగి విష్ణు ప్రసాద్ పరిచయం అయ్యాడు. తనకు సింగరేణిలో పలుకుబడి ఉండి ఉద్యోగాలు ఇప్పించే వ్యక్తి వరంగల్ లో ఉన్నాడని చెప్పాడు. దీంతో ఆయన వలలో పడిన నగేష్ కుమార్ తన భార్యకు ఉద్యోగం ఇప్పించాలని కోరగా వరంగల్ లోని దళారి దాసు హరికిషన్ ను పరిచయం చేశాడు. ఉద్యోగం ఇప్పించడానికి 2022 సంవత్సరంలో 15 లక్షలు బేరం కుదుర్చుకుని అడ్వాన్సుగా ఐదు లక్షల రూపాయలు విష్ణుప్రసాద్ ద్వారా హరికిషన్ కు బాధితుడు అందజేశారు. ఉద్యోగం ఇప్పించక ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చివరకు నగేష్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. హరికిషన్ పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు నెలల క్రితం ఎనిమిది చీటింగ్ కేసులు నమోదు అయి జైలుకు వెళ్లి వచ్చినట్లు ఆయన చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com