ఫోన్‌పే కస్టమర్లూ జర జాగ్రత్త..

ఫోన్‌పే కస్టమర్లూ జర జాగ్రత్త..
ఫోన్ పే పేరుతో కొత్త తరహా మోసం బయటపడింది. కస్టమర్ కేర్ పేరుతో అకౌంట్‌లో డబ్బులు మాయం చేశారు. నగరంలోని ఐడీపీ కాలనీకి చెందిన నాగరాజు క్యాటరింగ్ చేస్తుంటాడు.

జేబులో పైసా లేకపోయినా అకౌంట్లో డబ్బులుంటే చాలు. ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఏమైనా కొనొచ్చు. అంతా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్. నిమిషాల్లో పనైపోతుంది. కానీ జాగ్రత్తగా ఉండకపోతే మోసం కూడా అంతే త్వరగా జరుగుతుంది. అకౌంట్లో ఉన్న డబ్బంతా ఊడ్చిపెట్టేస్తున్నారు. గుంటూరులో ఫోన్ పే పేరుతో కొత్త తరహా మోసం బయటపడింది. కస్టమర్ కేర్ పేరుతో అకౌంట్‌లో డబ్బులు మాయం చేశారు.

నగరంలోని ఐపీడీ కాలనీకి చెందిన నాగరాజు క్యాటరింగ్ చేస్తుంటాడు. తన మిత్రుడు రూ.400 కావాలని అడిగితే ఫోన్ పే యాప్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు. కానీ స్నేహితుడు డబ్బు రాలేదన్నాడు. దీంతో నాగరాజు ఫోన్ పే కస్టమర్‌కు కాల్ చేసి డబ్బు అందని విషయం చెప్పాడు. చెక్ చేస్తామని చెప్పారు. మళ్లీ ఈ నెల 5న ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఫోన్ పే కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు.

రూ. 400 తిరిగి జమ చేస్తామని అతడిని నమ్మించాడు. నాగరాజు ఫోన్ యాప్‌కు పంపిన వెరిఫికేషన్ కోడ్ చెప్పాలని ప్రసాద్ అడిగాడు. నాగరాజు ఆ కోడ్ చెప్పిన వెంటనే అకౌంట్ నుంచి రూ.49,248 విత్ డ్రా అయిట్లు మెసేజ్ వచ్చింది. ఆ డబ్బు ఎందుకు డ్రా అయిందని నాగరాజు అడిగాడు. మరో కోడ్ పంపించామని అది చెప్తే మొత్తం డబ్బు జమ చేస్తామన్నాడు.

అతడి మాటలు నమ్మి మరోసారి మోసపోయాడు నాగరాజు.. మళ్లీ కోడ్ పంపించడంతో ఈసారి అకౌంట్లో నుంచి మరో రూ.48,657 డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిప్ట్ చేయలేదు. స్విచ్ఛాఫ్ అని వస్తుండేసరికి మోస పోయానని తెలుసుకున్నాడు. మొత్తం రూ.97 వేలు పోయాయంటూ పోలీసులతో మొర పెట్టుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story