కలకలం రేపుతున్న ఏలూరు యువకుడి కిడ్నాప్

కలకలం రేపుతున్న ఏలూరు యువకుడి కిడ్నాప్
విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ ఘటన మరువక ముందే ఏలూరులోనూ ఓ యువకుడిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.

విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ ఘటన మరువక ముందే ఏలూరులోనూ ఓ యువకుడిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలో యువకుడిని కొందరు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ ఉదంతంలో ఓ వైసీపీ నేత ఉండటంతో సంచలనంగా మారింది.అయితే ఈ కేసును 12 గంటల వ్యవధిలో ఛేదించారు పోలీసులు. ఏలూరుకు చెందిన కుట్టి చంద్రశేఖర్‌ చేబ్రోలు రైల్వేస్టేషన్‌ మాస్టారుగా పనిచేస్తున్నారు. ఆయన భార్య మూడేళ్ల క్రితం మరణించారు. ఏలూరు ప్రభుత్వా స్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పంచకర్ల గ్రీష్మకు కూడా భర్త మరణించడం తో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అయితే వీరి మధ్య విభేదాలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఆమెతో మాట్లాడడానికి చంద్రశేఖర్‌ ఈనెల 15వ తేదీ రాత్రి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అయితే రాత్రి 9.17 నిముషాల సమయంలో ఒక మహేంద్ర జీపు అతి వేగంగా ఆస్పత్రి ఆవరణలోకి వచ్చింది. ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లికి చెందిన వైసీపీ నేత, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ బాలిబోయిన నవహర్ష అతనితో పాటు అతని అనుచరులు పుట్టి చంద్రశేఖర్‌ను కొట్టుకుంటూ జీపులో తీసుకెళ్లారు.

ఆ తర్వాత ఏలూరు రూరల్‌ మండలం పోణంగి రోడ్డులోని పొల్లాల్లోకి తీసుకెళ్లి కర్రలతో కొట్టి 50కు పైగా ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. కొన్ని డాక్యుమెంట్లు, తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని అతనితో లేఖ కూడా రాయించుకున్నారు. ఇంకెప్పుడు గ్రీష్మతో మాట్లాడనని ఆమెతో ఎలాంటి సంబంధం లేదని రాయించుకున్నారు. చంద్రశేఖర్‌ పెళ్లికి సంబంధించి ఫొటోలు, ఇతర ఆధారాలను డిలీట్‌ చేసి ఆ ఫోను కూడా వారు తీసేసుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించి విడిచిపెట్టారు. గాయాలతో అతను అతి కష్టం మీద ఇంటికెళ్లి ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రధాన నిందితుడైన ఏలూరు మాదేపల్లికి చెందిన బాలిబోయిన నవహర్షతో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నవహర్ష గతంలో మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని వద్ద ముఖ్య అనుచరుడిగా హవా కొన సాగించాడు. ప్రస్తుతం మార్కెట్‌యార్డు డైరెక్టర్‌గా ఉంటున్నాడు. నిందితుల నుంచి కిడ్నాప్‌కు వినియోగించిన మహేంద్ర జీపు, స్టేషన్‌ మాస్టర్‌కు చెందిన సెల్‌ఫోను, అతని చేత రాయించుకున్న ప్రామిసరీ నోట్లు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవహర్ష జీపు నుంచి స్వాధీనం చేసుకున్న ప్రామిసరీ నోట్లను చూసి పోలీసులే అవాక్కయ్యారు. ప్రణాళిక ప్రకారం ముందస్తుగానే కారులో ప్రాంసరీనోట్లు, తెల్లకాగి తాలు పెట్టుకుని ఉన్నారంటే గతంలోను ఇలాంటి నేరాలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story