KILLED: ఓ తండ్రి రాసిన మరణ శాసనం

భారత టెన్నిస్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడంపై తలెత్తిన వివాదం చివరకు ఒక తండ్రి తన కన్న కూతురినే తుపాకీతో కాల్చి చంపేంత దారుణానికి దారితీసింది. ఈ అత్యంత విషాదకర ఘటన గురుగ్రామ్‌లో గురువారం చోటుచేసుకుంది. జాతీయ క్రీడాకారిణి టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్‌ను కన్నతండ్రే కాల్చి చంపాడు. తన కుమార్తె రీల్స్ చేస్తూ తన పరువును మంట గలుపుతోందని రాధిక తండ్రి ఇంతటి దారుణానికి తెగబడ్డాడు. రాధిక పలు టోర్నమెంట్స్‌లో మెడల్స్ సాధించి కుటుంబానికి, ఆ ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. ది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు టెన్నీస్ మ్యాచ్‌లలో అసాధారణమైన ఆటతీరుతో తనకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉందని నిరూపించింది. కానీ, అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.కొద్ది కాలం క్రితం జరిగిన రాష్ట్రస్థాయి టెన్నీస్ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్‌కు తీవ్ర గాయమైంది. దీంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్‌కు దూరం కావడంతో మానసికంగా కుంగిపోయింది. అప్పుడే "నేను ఆటకు దూరమైతేనేం. నాలాగా టెన్నిస్ లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహిస్తే సరిపోతుంది కదా" అని అనుకుంది. అనుకున్నదే తడవుగా కుటుంబసభ్యులు, గురువుల సహకారంతో టెన్నిస్ అకాడమనీ ప్రారంభించింది.
సూటిపోటి మాటలు.. రీల్స్
టెన్నిస్ అకాడమీని నిర్వహిస్తూనే రాధిక ఇన్ స్టా రీల్స్ చేసేది. ఈ హత్యకు ఏడాది క్రితమే బీజం పడినట్లుగా తెలుస్తోంది. ఏడాది క్రితం రాధిక ఒక మ్యూజిక్ వీడియో చేసింది. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం బంధువుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా సొంతూరుకి వెళ్లినప్పుడల్లా.. కూతురు ఆదాయంతో బతుకుతున్నావని హేళన చేయడం కూడా రాధిక తండ్రికి రుచించలేదు. దీనిపై చాలా రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ వీడియోపై కూడా రభస నడుస్తోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడంతో ఆమె ఆర్థికంగా బలపడింది. ఆమె ఎవరినీ లెక్క చేయకుండా స్వేచ్ఛగా విహరిస్తోంది. ఈ వ్యవహారం తండ్రిని ఎంతగానో బాధపెట్టింది. దీంతో కుమార్తెను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వంటగదిలో రాధిక టిఫిన్ రెడీ చేస్తుండగా తండ్రి వెనుక నుంచి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. విచారణంలో కుమార్తెను తానే చంపినట్లుగా దీపక్ యాదవ్ అంగీకరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com