Crime : బిష్ణోయ్ తలపై రూ.కోటి నజరానా పెట్టిన క్షత్రియ కర్ణి సేన
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడిని ఎన్‌కౌంటర్ చేస్తే పోలీసులకు కోటికి పైగా నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణి సేన రివార్డ్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో రిలీజ్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసు అధికారికైనా వారి భద్రత, కుటుంబ భవిష్యత్తు కోసం కోటికి పైగా ఇస్తామని తెలిపారు. ఈ గ్యాంగ్ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదన్నారు. మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదని రాజ్ షెకావత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2023, డిసెంబర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అనంతరం ఆయనను తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. తాజాగా ఎన్సీపీ సీనియర్ నేత, సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేసింది కూడా తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడించింది. అతడికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండటంవల్లే హత్య చేసినట్లుగా పేర్కొంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. బ్యారక్‌ల్లోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com