నమ్మించి హత్య చేయించిన లెస్బియన్ లవర్..

నమ్మించి హత్య చేయించిన లెస్బియన్ లవర్..ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం షాజహాన్‌పూర్‌లో దారుణం జరిగింది. అబ్బాయిగా మారి తన లెస్బియన్ లవర్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి దారుణహత్యకు గురైంది. లింగమార్పిడి చేస్తానని నెపంతో ఒక మాంత్రికుడు అమ్మాయిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. దీనికి ప్రేమించిన అమ్మాయే సహకరించడం విస్మయానికి గురి చేసే అంశం. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ఇదీ నేపథ్యం...

ఆర్‌సీ మిషన్ స్టేషన్ పరిధికి చెందిన పూనమ్, పువాయాన్ ప్రాంతానికి చెందిన ప్రీతి ఇద్దరూ స్నేహితులు. కాలం గడచేకొద్దీ ఇద్దరూ ఇష్టపడి లెస్బియన్ రిలేషన్‌షిప్‌లో కొనసాగారు. దీంతో పూనమ్ అబ్బాయిలాగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇదిలా ఉండగా వీరి లెస్బియన్ రిలేషన్‌షిప్ వెలుగులోకి రావడంతో ప్రీతికి పెళ్లి సంబంధాలు రాకుండా పోయాయి.

దీంతో ప్రీతి తన తల్లి ఊర్మిళకి విషయం చెప్పగా, క్షుద్రపూజలు నిర్వహించే రామ్‌నివాస్ అనే మాంత్రికుడి సహాయంతో పూనమ్‌ని అంతం చేయాలని ప్లాన్ వేశారు. దీనికోసం 1.5 లక్షలు ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. 5 వేలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. అబ్బాయిగా మారాలన్న పూనమ్ కోరికను ఆసరాగా చేసుకుని ప్రీతి పూనమ్‌ను ఒక మాంత్రికుడి సాయంతో అబ్బాయి మార్చేలా చేయిస్తానని నమ్మించింది. అది నమ్మిన పూనమ్‌ ఏప్రిల్ 18 న తన ఇల్లు విడిచి వచ్చేసింది. ఆ రోజు నుంచి కనబడటం లేదంటూ పూనమ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏప్రిల్ 26న కేసు నమోదు అయింది.

ప్లాన్ ప్రకారం ప్రీతి తన లవర్ పూనమ్‌ని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లింది. రామ్‌నివాస్, ప్రీతిని అబ్బాయిగా మారుస్తామని నమ్మించి అక్కడ నది ఒడ్డున పూనమ్‌ని పడుకోబెట్టి, కళ్లు మూసుకోమని చెప్పి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఆనవాళ్లు కనబడకుండా పూనమ్‌ మృతదేహాన్ని దాచి పారిపోయారు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు రామ్‌నివాస్‌, ప్రీతిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సహకరించిన తల్లి ఊర్మిళ పరారీలో ఉంది. రామ్‌ నివాస్ ఇంటి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు సేకరించారు.

Tags

Read MoreRead Less
Next Story