Maharashtra Encounter: తొమ్మిదిన్నర గంటల పాటు ఎదురుకాల్పులు.. 26 మంది మావోయిస్టులు..

Maharashtra Encounter: మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మొత్తం 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఎన్‌కౌంటర్ జరగడానికి ఒక రోజు ముందే సీ-60 స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్‌కు చెందిన పోలీసు బలగాలను గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి సబ్ డివిజన్‌లోని మర్దింటోల అటవీ ప్రాంతానికి తరలించామని తెలిపారు. మావోయిస్టులు క్యాంపు వేసిన ప్రాంతాన్ని వెతక్కుంటూ భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయని.. మొదట మావోయిస్టులే కాల్పులు జరిపారని వెల్లడించారు.
దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయన్నారు ఎస్పీ. మొత్తం 26 మంది మావోయిస్టులు చనిపోయినట్లు గుర్తించామన్నారు. అక్కడ దొరికిన ఆయుధాలను పరిశీలించిన తర్వాత కీలకమైన నాయకులే చనిపోయి ఉండొచ్చన్న అంచనాకు వచ్చామని, చివరకు 26 మందిలో 16 మందిని గుర్తించామని, ఇంకా పది మంది వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు మిళింద్ టెల్టుంబ్డేతో పాటు ఆయన బాడీ గార్డు, ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు, ఇద్దరు కమాండర్లు, ఒక ఏరియా కమిటీ సభ్యుడు, ఐదుగురు దళ సభ్యులు, ముగ్గురు ప్లాటూన్ కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నట్లు వెల్లడించారు.
ఎన్‌కౌంటర్ తర్వాత ఆరు ఏకే-47లు, తొమ్మిది ఎస్ఎల్ఆర్, ఒక ఇన్సాస్, మూడు 303 రైఫిళ్లతో పాటు మొత్తం 29 ఆయుధాలను, రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టులు క్యాంపు చేసిన చోట టెంట్లు, కిట్ బ్యాగులు, వంట సామాన్లు, నిత్యావసరాలు కూడా లభ్యమైనట్లు ఎస్పీ తెలిపారు. వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు యాక్షన్‌కు వాడే వాకీటాకీలు, వాటి ఛార్జర్లు, సోలార్ ప్యానెల్, పేలుడు పదార్ధాలు, డిటొనేటర్లు, ఎలక్ట్రిక్ వైర్ తదితరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com