Karnataka: కోర్టు ఆవరణలోనే భార్య గొంతుకోసి చంపిన భర్త..

Karnataka: వారిద్దరి వివాహ జీవితం అనుకున్నట్టుగా సాగలేదు. అందుకే విడిపోవాలి అనుకున్నారు. విడాకులకు అప్లై చేశారు. కోర్టుకు వెళ్లారు. కానీ కోర్టు మాత్రం వారికి ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత విడాకులు తీసుకోవాలి అనిపిస్తే సమ్మతమే అని తెలిపింది. దీంతో వారిద్దరూ కౌన్సిలింగ్‌కు అటెండ్ అయ్యారు. కలిసుండాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు ఆ కోర్టు ఆవరణలోనే గొంతు కోసి భార్యను హతమార్చాడు భర్త. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్ణాటకకు చెందిన శివకుమార్, చైత్ర ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కానీ పలు కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోవాలి అనుకున్నారు. దానికోసం హాసన్ జిల్లా హోలెనరసిపుర కోర్టును ఆశ్రయించారు. కోర్టు వీరికి కౌన్సిలింగ్ తీసుకోమని తెలిపింది. దీంతో వీరు కౌన్సిలింగ్ సెషన్స్‌కు హాజరవుతున్నారు. అక్కడ వారు మనస్పర్థలను మర్చిపోయి, మళ్లీ కలిసిపోతామని అంగీకరించారు.
కౌన్సిలింగ్‌లో కలిసిపోతామని అంగీకరించిన అరగంట తర్వాత చైత్ర టాయిలెట్‌కు వెళ్లింది. అక్కడ వరకు తనతో వెళ్లిన శివకుమార్.. తనతో తెచ్చుకున్న కత్తితో చైత్ర గొంతుకోసాడు. ఆ తర్వాత అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు స్థానికులు తనను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన చైత్ర.. ఆసుపత్రికి తరలించగానే మరణించింది. అయితే కోర్టులోకి అతడు కత్తి ఎలా తీసుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com