RG Kar Doctor Death : బెంగాల్‌లో జూడా హత్య.. నిలిచిపోయిన వైద్యసేవలు

నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో కొన్ని రకాల వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. 'ది ఫెడరరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)' దీనిపై ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పశ్చిమ బెంగాల్ లోని ప్రభుత్వ వైద్య కాలేజీలో జూనియర్ డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్జీ కార్ మెడికాల్ కాలేజీ వైద్యులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్డా తెలిపింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై దారుణాన్ని దేశ వ్యాప్తంగా వైద్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఈ నెల 9న కోల్ కతాలోకి ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఓ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి విధుల్లో ఉన్న ఆమె.. శుక్రవారం ఉదయం ఆస్పత్రి సెమినార్ హాలులో శవమై కన్పించారు. ఘటనాస్థలంలో దొరికిన బ్లూటూత్ ఆధారంగా ఒక సివిక్ వాలంటీరిని అరెస్టు చేశారు. బాధితురాల్ని దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఆమెకు సంఘీభావంగా వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఫోర్డా తెలిపింది. జూనియర్ వైద్యురాలి దారుణహత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోర్డ్ శనివారం నాడు కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఇందుకు 24 గంటల డెడ్ లైన్ ఇచ్చింది. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. అన్నట్టుగానే దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపి వేత నిర్ణయం అమలుచేస్తోంది.
వైద్యురాలి హత్యని రాజకీయం చేయకుండా నిందితుల్ని వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫోర్డ్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసింది. హత్యకు గురైన వైద్యురాలు కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేసి తగిన పరిహారం అందించాలని వారు తమ లేఖలో డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కఠినమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసి, అమలు చేయాలని వైద్యుల సంఘం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. సెంట్రల్ హెల్త్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వేగవంతం చేయడానికి వైద్య సంఘాల ప్రతినిధులతో సహానిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నడ్డాకు రాసిన లేఖలో కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com