ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌ ప్లాన్.. జైల్లోనే స్కెచ్‌

ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌ ప్లాన్.. జైల్లోనే స్కెచ్‌
X
విశాఖ ఎంపీ కుమారుడు శరత్‌ ‌నివాసంలో 48 గంటలపాటు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తరహా క్రైమ్‌ కహానీ

ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌ ఉదంతం ప్రశాంతంగా ఉండే విశాఖలో కల్లోలం రేపుతోంది. విశాఖ నేరాలకు అడ్డాగా మారిందంటూ సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమయ్యాయి. విశాఖ ఎంపీ కుమారుడు శరత్‌ ‌నివాసంలో 48 గంటలపాటు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తరహా క్రైమ్‌ కహానీ నడిచింది. ఐతే ఈ కిడ్నాప్‌ ఆలోచన జైల్లోనే మొగ్గ తొడిగిందట. కిడ్నాప్‌ చేసి డబ్బు సంపాదించాలనే వికృత ఆలోచన రాగానే దానికి చకచకా స్కెచ్‌ రూపొందించారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎంపీ ఇంటినే తమ ఆధీనంలోకి తీసుకొని ముగ్గురిని కిడ్నాప్‌ చేశారు. రెండు రోజులపాటు ఎంపీ కుటుంబీకులను, ఆడిటర్‌ను నిర్బంధించి, దాడిచేసి డబ్బులు వసూలు చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు, వైసీపీ నేత జీవీ కిడ్నాప్‌ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ కిడ్నాప్‌ ఆలోచన విశాఖ జైల్లోనే మొగ్గతొడిగింది. ప్రధాన నిందితుడైన కోలా వెంకట హేమంత్‌కుమార్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ రియల్టర్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్టయ్యి మే 10వ తేదీన విడుదలయ్యాడు. మరో నిందితుడు రాజేష్‌ బైక్‌ల చోరీ కేసులో 2021 సెప్టెంబరులో అరెస్టయ్యి ఈ ఏడాది మే 2వ తేదీ విడుదలయ్యాడు. వీరిద్దరూ విశాఖపట్నం సెంట్రల్‌ జైల్లో ఉన్నప్పుడే ఈ కిడ్నాప్‌నకు స్కెచ్‌ వేశారు. రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంట్లలో డబ్బులు పోగొట్టుకున్నానని బయటకు వెళ్లాక చేసే దోపిడీలో తనకు 40 శాతం ఇవ్వాలని రాజేశ్‌ను హేమంత్‌ కోరినట్లు తెలిసింది.

జైలు నుంచి బయటకు వచ్చాక ఎంపీ కుమారుడు శరత్‌ ఇంటివద్ద హేమంత్‌, రాజేశ్‌ రెక్కీ చేశారు. హేమంత్‌ జూన్‌ 11న ఎంవీపీ కాలనీలోని టాస్క్‌ఫోర్సు స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరైనా, పగలంతా దోపిడీ ప్రణాళికల్లో నిమగ్నమయ్యాడు. జైల్లో అనుకున్నట్లే రాజేశ్‌కు సంబంధించిన నలుగురు సభ్యుల గాజువాక గ్యాంగ్‌ను రంగంలోకి దింపారు. హేమంత్‌, రాజేష్‌, ఓ బాల నేరస్థుడితో కలిసి 12వ తేదీ సోమవారం అర్ధరాత్రి 1.30 సమయంలో రుషికొండలోని శరత్‌ ఇంట్లోకి తెరిచి ఉన్న కిటికీల నుంచి ప్రవేశించారు. అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో హేమంత్‌ తన ఇంటి వద్దే బీట్‌ కానిస్టేబుళ్లకు కనిపించినా ఆ తర్వాత వెంటనే కథ నడిపాడు. కిడ్నాపర్లు ఎంపీ ఇంట్లో 48 గంటలపాటు నిరంతరాయంగా గంజాయి తాగుతూనే ఉన్నారు. ఆ మత్తులోనే ఎంపీ కుటుంబ సభ్యులను, జీవీని చిత్రహింసలు పెట్టారు. ఇంట్లోకి జీవీ వెళ్లగానే బ్యాట్‌, కర్రలతో దాడికి దిగారు. బుధవారం ఉదయం ఎంపీ భార్య జ్యోతిని రప్పించి ఆమె వద్ద ఉన్న బంగారం తీసుకుని బంధించారు. జీవీని కిడ్నాప్‌ చేశాక వారడిగిన డబ్బు తనవద్ద లేదని చెప్పగా ఎవర్ని అప్పు అడగాలో హేమంత్‌ చెప్పినట్లు బాధితులు తెలిపారు. జీవీ తన డ్రైవర్‌ ద్వారా కోటి రూపాయలు సమకూర్చి చేతుల్లో పెట్టాక కానీ హేమంత్‌ గ్యాంగ్‌ శాంతించలేదు. చేతికందిన డబ్బులో 40 లక్షలను హేమంత్‌ తన సన్నిహితురాలు సుబ్బలక్ష్మికి పంపాడు. తర్వాత కేసులో బెయిల్‌ ఇప్పించేందుకు రాజేష్‌ అనే న్యాయవాదికి 21లక్షలు పంపారు. కిడ్నాప్‌లో మొదటిరోజు నుంచి పాల్గొన్న మరో బాలనేరస్థుడు గురువారం ఉదయం భయపడి బయటకు వెళ్లిపోయాడు. ఎర్రోళ్ల సాయి, మరో బాలనేరస్థుడు మిగిలిన వారికి సహకరించారు.

ఎంపీ ఫిర్యాదుతో 15వ తేదీన స్పందించిన పోలీసులు పరిశీలించినప్పుడు జీవీ, హేమంత్‌ల సెల్‌ లోకేషన్లు ఒకేచోట ఉన్నట్లు తెలిసింది. తర్వాత టాస్క్‌ఫోర్సు పోలీసులు హేమంత్‌కు ఫోన్‌ చేశారు. తాను మధురవాడలో ఉన్నానని చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. ఇంటిపైకి వెళ్లిన కిడ్నాపర్లు సమీపంలో పోలీసులను గమనించారు. దీంతో అక్కడున్న ఆడి కారు డిక్కీలో శరత్‌ను కుక్కేశారు. వెనుక సీట్లలో జ్యోతి, జీవీలను ఉంచి పద్మనాభం మండలం నీళ్లకుండీల గ్రామం వైపు వెళ్లారు. కారులో రాజేష్‌, ఎర్రోళ్ల సాయి ఉండగా, హేమంత్‌ కారు నడిపాడు. కొద్దిదూరం వెళ్లగానే కారు టైరు పంక్చర్‌ కాగా, మరమ్మతులు చేయించారు. బాధితులను సమీప జంక్షన్‌లో దింపేసి వెళ్లిపోయారు. తర్వాత కిడ్నాపర్లు వెళ్తున్న కారుకు రెండువైపులా పోలీసులు తమ వాహనాలను అడ్డుగా పెట్టారు. కిడ్నాపర్లు వాటిని కారుతో ఢీకొట్టడంతో అది అదుపు తప్పి ఆగిపోయింది. పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో హేమంత్‌ ఓ కానిస్టేబుల్‌ను కత్తితో బెదిరించినా పోలీసులు అతడిని పట్టుకున్నారు.

కిడ్నాప్‌ కేసులో ఇప్పటివరకూ ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు హేమంత్‌ కుమార్‌, వలవల రాజేష్‌తో పాటు, అతనికి సహకరించిన న్యాయవాది బొమ్మిడి రాజేష్‌లను అరెస్టు చేశారు. డీసీపీలు విద్యాసాగర్‌ నాయుడు, నాగన్నల నేతృత్వంలో విచారణ చేపట్టి నిందితుల నుంచి నగదు, ఒక క్రికెట్‌ బ్యాట్‌, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఎర్రోళ్ల సాయితో పాటు సంబంధం ఉన్నవారి కోసం పోలీసులు 7 బృందాలు ఏర్పాటుచేసి గాలింపు చేపట్టారు

ఇంట్లో దాక్కున్న ముగ్గురు కిడ్నాపర్లు 13వ తేదీ ఉదయం 7.30కు గదిలోంచి బయటకు వచ్చిన ఎంపీ కుమారుడు శరత్‌పై బ్యాట్‌తో దాడిచేయడంతో ఆయన గాయపడ్డారు. శరత్‌ ఎదురు తిరగడంతో హేమంత్‌ చేతికి గాయాలైనట్లు తెలుస్తోంది. శరత్‌ను పట్టుకుని కట్టేశాక రాజేష్‌ కొన్ని మందులు కొన్నాడు. స్టేషన్‌లో సంతకం పెట్టకపోతే తనపై అనుమానం వస్తుందని భావించిన హేమంత్‌ ఎంపీ కుమారుడితో బలవంతంగా పీఎంపాలెం స్టేషన్‌కు ఫోన్‌ చేయించాడు. తన పనిమీద హేమంత్‌ వెళ్లాడని, మూడు రోజులు స్టేషన్‌కు రాడని చెప్పించారు. ఐతే తన కుటుంబసభ్యులను కిడ్నాప్‌ చేసిన దుండగులు గంజాయి, మద్యం మత్తులో ఉన్నారని విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. తన భార్య, కుమారుడితోపాటు స్నేహితుడు జీవీని చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తమతో కలిసి ఎప్పుడూ పనిచేయలేదని, తన భాగస్వామి అంతకంటే కాదని ఎంపీ స్పష్టం చేశారు.

Tags

Next Story