Crime : వీడిన తిరుపతి అడవిలో నాలుగు మృతదేహాల మిస్టరీ

Crime : వీడిన తిరుపతి అడవిలో నాలుగు మృతదేహాల మిస్టరీ
X

తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి టోల్‌ప్లాజా సమీపంలోని అడవిలో ఇటీవల లభ్యమైన నాలుగు మృతదేహాలు తమిళనాడుకు చెందిన ఒకే కుటుంబం సభ్యులవిగా పోలీసులు గుర్తించారు. చెట్టుకు వేలాడుతూ కనిపించిన వ్యక్తి కళైసెల్వన్ అని.. కిందపడి ఉన్న మహిళ మృతదేహం ఆయన సోదరి జయమాలదని పోలీసులు నిర్ధారించారు. అడవిలో గుంతల్లో పాతిపెట్టిన మిగతా రెండు మృతదేహాలు జయమాల కుమార్తెలు దర్శిని, వర్షిణి లవిగా తేలింది. జయమాల భర్త వెంకటేశ్ మంగళవారం పోలీసులను సంప్రదించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివాదానికి దారితీసిన అంశాలు: వెంకటేశ్ కువైట్‌లో పనిచేస్తూ తన భార్యకు సుమారు రూ.40 లక్షలు పంపించారు. ఆ డబ్బు ఖాతాలో లేకపోవడంతో ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వెంకటేశ్ ఆరోపణల ప్రకారం.. జయమాల తన సోదరుడు కళైసెల్వన్‌తో కలిసి ఫైనాన్స్ వ్యాపారం చేసి ఈ డబ్బును దుర్వినియోగం చేశారు. ఇటీవల కువైట్ నుంచి తిరిగి వచ్చిన వెంకటేశ్, కళైసెల్వన్‌పై మోసం కేసు పెట్టారు.

ఈ ఘటన తర్వాత జయమాల, పిల్లలు, కళైసెల్వన్ కనిపించకుండా పోవడంతో జులై 4న వెంకటేశ్ తమిళనాడులోని పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఇంతలోనే వారి మృతదేహాలు తిరుపతి అడవిలో లభ్యం కావడం విషాదం నింపింది. ఇది ఆత్మహత్య, లేదా హత్య అనేది తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది

Tags

Next Story