Gachibowli : గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ మృతి కేసును చేధించిన పోలీసులు

గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో నర్సు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని గచ్చిబౌలి పోలీసులు తేల్చారు.శృతికి మహబూబ్‌నగర్‌లో మోటార్ డ్రైవింగ్ స్కూల్‌లో జీవన్ పాల్‌తో పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో శృతి, జీవన్ పాల్ సహా మరో జంట రెడ్ సోర్స్ హోటల్‌లో రెండు రూములు తీసుకున్నారు. హోటల్ రూమ్‌లో బీరు తాగిన సమయంలోని ఇరువురి మధ్య పెళ్లి విషయం చర్చకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాదం చెలరేగడంతో తన మిత్రుడు గదికి జీవన్ వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి తన గదిలో ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రస్తుతం జీవన్ పాల్, మరో జంట ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడం, పెళ్లికి నిరాకరించడం వల్లే మద్యం మత్తులో, తీవ్ర మనస్థాపం చెందిన సదరు యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com