POCSO : మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి 50ఏళ్ల జైలు శిక్ష నల్గొండ కోర్టు

POCSO : మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి 50ఏళ్ల జైలు శిక్ష నల్గొండ కోర్టు
X

మైనర్ బాలికపై అత్యాచార కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు మహ్మద్ ఖయ్యూమ్‌కు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు చెప్పారు. బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడానికి కఠిన శిక్షలు అవసరమని, ఈ తీర్పు సమాజానికి హెచ్చరికగా నిలవాలని జడ్జి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

కేసు వివరాలు

2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ దళిత బాలికపై మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. బాధితురాలు తన కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు మహ్మద్ ఖయ్యూమ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2022 నుంచి ఈ కేసుపై నల్గొండ జిల్లా కోర్టులో వాదనలు కొనసాగాయి.

నిందితుడు మహ్మద్ ఖయ్యూమ్‌ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం వివిధ సెక్షన్ల కింద శిక్షలు విధించింది. అత్యాచార నేరానికి గాను 20 ఏళ్ల జైలు శిక్ష. పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష. ఎస్సీ-ఎస్టీ చట్టం కింద 10 ఏళ్ల జైలు శిక్ష. సెక్షన్ 506 కింద మరో ఏడాది శిక్ష పడింది. ఈ అన్ని శిక్షలు ఒకేసారి అమలు అవుతాయని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, నిందితుడికి రూ. 85,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ పరిహారాన్ని వీలైనంత త్వరగా అందజేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

Tags

Next Story