Mulugu: ములుగు జిల్లాలో సీనియర్ న్యాయవాది దారుణ హత్య..

Mulugu: ములుగు జిల్లాలో దారుణ హత్య జరిగింది. సీనియర్ లాయర్ మల్లారెడ్డిని కత్తులతో పొడిచి హతమార్చారు. నిన్న సాయంత్రం 6:40 సమయంలో ఐదుగురు దుండగులు.. న్యాయవాది మల్లారెడ్డిని చంపేశారు. మల్లారెడ్డి కొన్ని రోజులుగా ములుగు వస్తూ వెళ్తుండడాన్ని ప్రత్యర్ధులు ఓ కంట కనిపెడుతూ వచ్చారు. నిన్న మధ్యాహ్నం కూడా హన్మకొండ నుంచి ములుగు వచ్చారు. కలెక్టరేట్‌లో పలువురు అధికారులను కలిశారు. ములుగు నుంచి తిరుగు ప్రయాణమైన మల్లారెడ్డిని.. దుండగులు కారులో వెంబడించారు.
భూపాల్‌నగర్ స్టేజి వద్దకు రాగానే అదును చూసి న్యాయవాదిని హత్య చేశారు. ఈ హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్య చేసిన తర్వాత నిందితులు రెండు కార్లలో హన్మకొండ వైపు వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మధ్యలో మల్లంపల్లి క్రాస్ నుంచి నర్సంపేట రోడ్డు వైపు వెళ్లారా లేదా హన్మకొండ వైపు వెళ్లారా లేదా అనేది తెలియడం లేదు. గుడెప్పాడ్ నుంచి పరకాల, భూపాలపల్లి వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వాహనాలు ఎటువైపు వెళ్లాయోనని ఆరా తీస్తున్నారు.
లాయర్ మల్లారెడ్డి.. మైనింగ్, పెట్రోల్ పంప్, స్కూళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. మల్లంపల్లి పరిసర ప్రాంతాల్లోని భూములకు సంబంధించిన వివాదాల్లో లాయర్ మల్లారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఎర్రమట్టి క్వారీ సైతం నడిపిస్తున్నట్టు చెబుతున్నారు. మల్లారెడ్డి కార్యకలాపాలపై గతంలో మావోయిస్టులు హెచ్చరించినట్టు కూడా రికార్డ్స్ ఉన్నాయి. గతంలో ములుగు పోలీస్ స్టేషన్‌లో మల్లారెడ్డిపై ఓ కేసు కూడా నమోదైంది. ఆ కేసుకు సివిల్ నేపథ్యం ఉండడంతో ఈ మధ్యే కొట్టేసినట్టు తెలుస్తోంది. అయితే, భూముల విషయంలో గొడవలు ఉండడంతో.. ప్రత్యర్థులే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com