గుండీల్లో, బ్యాగుల్లో, సబ్బుల్లో పెట్టి మరి డ్రగ్స్ రవాణా ..

డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. దుస్తులకు ఉన్న గుండీల్లో, బ్యాగుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో, చివరకు సబ్బుల్లో కూడా పెట్టి డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ఆఫ్రికా ఖండంలోని బురుండీ దేశం నుంచి వచ్చిన 43 ఏళ్ల మహిళ నుంచి అధికారులు 14.2 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ కస్టమ్స్ విభాగం అదనపు కమిషనర్ గాంధీ దొంతి ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కెన్యా నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా, ఒక మహిళ చేతిలోని బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించింది. బ్యాగ్‌లోని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఆశ్చర్యపోయారు. మహిళల దుస్తులకు ఉన్న గుండీలు, సబ్బుల లోపల, బ్యాగ్‌లో ఉన్న ప్రత్యేక అరల్లోనూ గోధుమరంగులో ఉన్న పదార్థం కనిపించింది. దీన్ని బయటకు తీసి పరీక్షలు నిర్వహించగా అది హెరాయిన్ అని తేలింది. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ మొత్తం 2027 గ్రాములు కాగా, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 14.2 కోట్ల రూపాయలుగా తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com