Smuggling: పేస్టు రూపంలో బంగారం స్మగ్లింగ్

Smuggling: పేస్టు రూపంలో బంగారం స్మగ్లింగ్
అధికారులు రోజు రోజుకు తనిఖీలను కఠినతరం చేయడంతో కిలోల కొద్ది బంగారం చిక్కుతోంది.

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నా స్మగ్లర్లు కొత్త దారుల్లో విదేశాల నుంచి బంగారు తీసుకొస్తున్నారు. అధికారులు రోజు రోజుకు తనిఖీలను కఠినతరం చేయడంతో కిలోల కొద్ది బంగారం చిక్కుతోంది.శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కోటి రూపాయలకు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్, షార్జా తోపాటు రాసల్ కైమా ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద 2కిలోలకు పైగా బంగారాన్ని పట్టుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి ఓ ప్రయాణికుడు దుస్తులతో పాటు లగేజ్ బ్యాగు, విమానం సీటు కింద దాచుకుని హైదరాబాద్ వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. రసల్ కైమా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి 72లక్షల విలువ చేసే 1196 గ్రాముల బంగారాన్ని పేస్టు రూపంలో తెచ్చాడని తెలిపారు.

కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు 752 గ్రాముల బంగారు బిస్కెట్లను తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 45లక్షలు విలువ చేసే 752 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి 20లక్షల విలువ చేసే 331గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. మొత్తానికి ఒక్కరోజే ముగ్గురు వ్యక్తుల నుంచి కోటి 37లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. ముగ్గురిపై బంగారం అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో కేసులో కాంబోడియా నుంచి బ్యాంకాక్ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి లక్షకు పైగా విదేశీ సిగరేట్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story