TG : గంజాయి చాక్లెట్లకు అడ్డాగా దుకాణాలు

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అనే పదాలు వినిపించొద్దని.. వాటిపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రేవంత్ సర్కారు సీరియస్ గా ఉండటంతో పాటు వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ సప్లయ్ కు తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే, సిటీ శివార్లలోని కిరాణా షాపుల్లో విచ్చలవిడిగా గంజాయి చాక్లెట్లు అమ్మకాలు జరగుతుండటం కలకలం రేపుతోంది. ఇటీవల కొంతకాలంగా పోలీసులు జరుపుతున్న దాడుల్లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడుతున్నాయి.
కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ పరిధి జగద్గిరిగుట్టలో గత నెల పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు దొరకడం కలకలం రేపింది.ఓ కిరాణా షాప్‌లో ఈ గంజాయి చాక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేశారు. సుమారు తొమ్మిదిన్నర కేజీల బరువు ఉండే చాక్లెట్ పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాప్‌ను నిర్వహిస్తోన్న ఓ మహిళను అరెస్ట్ చేశారు. అయితే, కిరాణా షాపుల్లో కూడా గంజాయి దొరుకుతోందని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ గత నెల 1న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కుత్బుల్లాపూర్ శివార్లలో ఇంజినీరింగ్, ఫార్మా, మెడికల్, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయని.. ఆ స్టూడెంట్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com