USA : అమెరికాలో సిద్దిపేట యువకుడి అనుమానాస్పద మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ యువకుడు కానరాని లోకాలకు చేరాడు. అమెరికాలో ఎంఎస్ చదువుతున్న సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి సమ్మామిష్ సరస్సులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని ధూలిమిట్టలోని కుటీగలకు చెందిన తూశాలపురం సాయి రోహిత్(23) గా గుర్తించారు. ఆయన మంగవ్వ, మహదేవ్ దంపతులకు పెద్ద కుమారుడు.
అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, 2022లో సీవీఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రోహిత్, సియాటిల్లోని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదివేందుకు 2023 డిసెంబర్లో యూఎస్ వెళ్లాడు. రోహిత్ తాను చదువుతున్న యూనివర్సిటీ ఆవరణలోనే మనదేశానికి చెందిన తన నలుగురు స్నేహితులతో కలిసి హాస్టల్ గదిలో నివాసం ఉంటున్నాడు. జూలై 22న ఔటింగ్ కు వెళ్లిన అతను క్యాబ్ లో హాస్టల్ గదికి తిరిగి వస్తుండగా, గమ్యస్థానానికి వెళ్లే మధ్యలో మరో క్యాబ్ ఎక్కి కనిపించకుండా పోయాడు.
ఫోన్ చేసినా రాకపోవడంతో అతని స్నేహితుడు అవినాష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన యూఎస్ పోలీసులు గత నెల 24న సరస్సులో అతడి మృతదేహాన్ని వెలికి తీశారు. అతడి మృతిపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించగా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సహకారంతో మృత దేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com