Spam Calls : స్పామ్ కాల్స్, మెసేజ్ లకు చెక్.. సిద్ధమైన టెలికాం కంపెనీలు

Spam Calls : స్పామ్ కాల్స్, మెసేజ్ లకు చెక్.. సిద్ధమైన టెలికాం కంపెనీలు
X

టెలికాం యూజర్లను వేధిస్తున్న స్పామ్ కాల్స్, మెసేజ్‌ల సమస్యకు చెక్‌ పెట్టేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమయ్యాయి. తమ మధ్య పోటీని పక్కనపెట్టి.. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ముందడుగు వేశాయి. ఈ విషయంలో భారతీ ఎయిర్‌టెల్‌ చొరవ చూపింది. కమర్షియల్‌ కాల్స్‌ కోసం వినియోగించే కార్పొరేట్ కనెక్షన్ల వివరాలు పంచుకోవాలని, వీటిపై పర్యవేక్షణ కోసం ఏకీకృత విధానం ఉండాలని ప్రతిపాదించింది. ఈ మేరకు కంపెనీ సీఈవో గోపాల్‌ విఠల్.. రిలయన్స్ జియో, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌, టాటా టెలీ సర్వీసెస్‌కు లేఖ రాసినట్లు ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ పేర్కొంది. రోజూ లక్షల మంది ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపాల్సిన సమయం ఆసన్నమైందని తన లేఖలో పేర్కొన్నారు. స్పామ్‌ కాల్స్‌ విషయంలో టెలికాం విభాగం, ట్రాయ్‌ ఇటీవలకాలంలో పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్పామ్‌, ఫిషింగ్‌ యాక్టివిటీని అడ్డుకునేందుకు పరిశ్రమ వర్గాల మధ్య సహకారం కూడా అవసరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో గోపాల్‌ విఠల్‌.. ఇతర టెలికాం కంపెనీలకు లేఖ రాశారు. కార్పొరేట్ కనెక్షన్ల పేర్లు, యాక్టివ్‌ నంబర్లను నెలవారీ పంచుకోవాలని పేర్కొన్నారు. తాము అందుకు సిద్ధంగా ఉన్నామని, ఇతర కంపెనీలు కూడా కలిసి రావాలని సూచించారు. తమ ఎంటర్‌ప్రైజెస్‌ కస్టమర్‌ డేటాను పంచుకోవడం వల్ల తమ ఆదాయంపై ప్రభావం పడుతుందని ఇన్నాళ్లూ ఈతరహా కీలక డేటాను పంచుకోవడంలో కంపెనీలు వెనకడుగు వేసేవి. స్పామ్‌ కాల్స్‌ పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అటు వినియోగదారులకు, పరిశ్రమకు కూడా శరాఘాతంగా మారిన వేళ టెల్కోలు డేటా బదిలీకి ముందుకు రావడం శుభపరిణామం అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags

Next Story