TERROR ATTACK: భారత్‌లో భారీ పేలుళ్లకు కుట్ర

భారతదేశ భద్రతను లక్ష్యంగా చేసుకుని మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా కుట్ర పన్నిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిఘా సంస్థల అప్రమత్తతతో పెద్ద విధ్వంసాన్ని అడ్డుకోవడం సాధ్యమైంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI), బంగ్లాదేశ్‌కు చెందిన తీవ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగిన వ్యక్తులు భారత్‌లో కీలక నగరాల్లో పేలుళ్లు సృష్టించేందుకు ప్రణాళికలు రచించినట్లు సమాచారం బయటపడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు మెరుపుదాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం ద్వారా భారీ ప్రమాదాన్ని తిప్పికొట్టారు. ఈ ఆపరేషన్ దేశ భద్రతా వ్యవస్థల సమన్వయానికి నిదర్శనంగా నిలిచింది.
ఢిల్లీ పోలీసులకు అందిన కీలక సమాచారం ఆధారంగా తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తృత దర్యాప్తు చేపట్టారు. పాకిస్తాన్ కేంద్రంగా, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలపై మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని దుస్తుల తయారీ యూనిట్లలో పనిచేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మిజానూర్ రెహ్మాన్, మహ్మద్ శబాత్, ఉమర్, మహ్మద్ లితాన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్ ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒకరు బంగ్లాదేశ్ పౌరుడిగా అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఈ వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులను సమర్పించి తమ అసలు గుర్తింపును దాచిపెట్టి గార్మెంట్ ఫ్యాక్టరీల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఉతుకూలి ప్రాంతంలో ఇద్దరు, పల్లడం ప్రాంతంలో ముగ్గురు, తిరుమురుగన్‌పూండి ప్రాంతంలో ఒకరు పని చేస్తున్నట్లు గుర్తించారు. సాధారణ కార్మికుల వేషంలో ఉండి, గోప్యంగా కుట్రలకు పాల్పడుతున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. పోలీసులు నిర్వహించిన సోదాల్లో నిందితుల వద్ద నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, పదహారు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డిజిటల్ పరికరాల ద్వారా వారు విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా పోస్టులు పెట్టినట్లు కూడా అధికారులు గుర్తించారు. అదేవిధంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నిఘా నిర్వహించడం, ప్రాధాన్యత గల ప్రదేశాలపై రహస్య పరిశీలనలు చేయడం వంటి కార్యకలాపాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ‘ఫ్రీ కాశ్మీర్’ పోస్టర్లు ఏర్పాటు చేసిన ఘటనతో కూడా ఈ నిందితులకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. దేశంలో సామాజిక ఉద్రిక్తతలు రేకెత్తించేలా, మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడే కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. వీరి అరెస్టుతో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
