Red Sandalwood Smugglers : ఎర్రచందనం స్మగ్లర్లు ముగ్గురు అరెస్టు
తిరుపతి సమీపంలోని శ్రీవారిమెట్టు వద్ద 7ఎర్రచందనం దుంగలతో పాటు కారును స్వాధీనం చేసుకోగా, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు ఆర్ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డికి చెందిన వై విశ్వనాథ్ టీమ్ గురువారం శ్రీవారిమెట్టు పార్కింగ్ నుంచి జూపార్కు వైపు కూంబింగ్ చేసుకుంటూ వెళుతుండగా, జూపార్క్ ప్రహరీ గోడ వద్ద కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలు పెడుతూండటాన్ని గమనించారు. దీంతో వారిని సమీపించే లోపు, టాస్క్ ఫోర్సు సిబ్బందిని చూసి ఆ వ్యక్తులు పారిపోయారు. కారులో ఎర్రచందనం దుంగలు నాలుగు ఉన్నాయి. వాటితో పాటు కారును స్వాధీనం చేసుకుని, పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తిరుమల రెండవ ఘాట్ రోడ్డు 36వ కల్వర్టు వద్ద అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేసుకుని వెళుతుండగా, అక్కడ ముగ్గురు అనుమానిత వ్యక్తులు కనిపించారు. వీరిని ప్రశ్నించగా, వీరిని జూపార్కు సమీపం నుంచి పారిపోయిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని, సమీపంలో దాచి ఉంచిన మూడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన గోపి అయ్యాకన్ను (26), శివరాజ్ మాణిక్యం (39), గోవిందరాజ్ (32)లుగా గుర్తించారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేశారు. సీఐ సురేష్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com