Tragic Accident : ఘోరం.. రైలు ఢీకొట్టడంతో తండ్రీ, కూతుళ్లు దుర్మరణం
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి రైల్వే స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొనడంతో తండ్రి, ఇద్దరు కూతుర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు మేడ్చల్ పట్టణం రాఘ వేంద్ర నగర్ కాలనీ వాసులుగా గుర్తించారు.
మృతుడు కృష్ణ గౌడవెల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్ మేన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ట్రాక్ మేన్ కృష్ణ ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇద్దరి కూతుర్లను రైల్వే స్టేషన్ కు తీసుకొచ్చాడు. కూతుర్లు రైల్వే ట్రాక్ పై ఆడుతుండగా ఆకస్మాత్తుగా రైలు దూసుకొచ్చింది. విషయం గమనించిన తండ్రి కృష్ణ కూతుర్లను కాపాడటానికి ప్రయత్నించాడు. అప్పటికే సమయం మించిపోవడంతో రైలు ఢీకొని ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.
రైలు ప్రమాదంలో మృతి చెందిన కృష్ణతో పాటు ఆయన కూతుర్లు (వర్షిత) (వర్షిణి) గా స్థానికులు గుర్తించి చెబుతున్నారు. ఒక్క క్షణంలో రైలు ఢీకొడంతో కుటుంబ పెద్దతోపాటు ఇద్దరు కూతుర్లు అక్కడికక్కడే మృతిచెందడంతో మృతుడి భార్య కన్నీరు మున్నీరై స్పృహతప్పి పడిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com