ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఫిబ్రవరి 13, మంగళవారం నాడు కాలిఫోర్నియాలోని శాన్ మాటియో నగరంలో కేరళకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంటిలో శవమై కనిపించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతుండగా, దీన్ని అధికారులు హత్య లేదంటే ఆత్మహత్య అని భావిస్తున్నారు. ఎన్‌బిసి బే ఏరియా నివేదిక ప్రకారం, మృతులు ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అతని భార్య అలిస్ ప్రియాంక బెంజిగర్ (40), వారి 4 ఏళ్ల కవల అబ్బాయిలుగా గుర్తించారు.
ఈ ఘటనలో ఇద్దరు పెద్దవారి మృతదేహాలను బాత్రూంలో కనుగొన్నారు. ఇద్దరూ తుపాకీ గాయాలతో ఉన్నారు. ఘటనా స్థలంలో 9ఎంఎం పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్ కూడా లభ్యమయ్యాయి. ఇక కవల అబ్బాయిలు ఒక పడకగదిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారి మరణానికి ఖచ్చితమైన కారణంపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. శరీరంపై గాయాలు ఉన్నందున.. వారిని ఊపిరి ఆడకుండా చేసి, ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్టు తెలుస్తోందని, లేదంటే వారు విషం తాగి ఉండవచ్చు అని విచారణకు దగ్గరగా ఉన్న వర్గాలు NBCకి తెలిపాయి.
2016 డిసెంబర్‌లో ఆనంద్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టు రికార్డులు సూచిస్తున్నాయి. అయితే దీనిపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఆ సంఘటనల వివరాలు వెల్లడించనప్పటికీ, ఇంటి నుండి వచ్చిన కాల్‌లకు పోలీసులు గతంలో స్పందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com