Bihar : తీవ్ర విషాదం.. ఏడుగురు భక్తుల దుర్మరణం

బిహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జెహనాబాద్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో ఇవాళ ఉదయం తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన 9 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన విషయం తెలిసిందే. తొక్కిసలాట ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని మఖ్దుంపూర్....జెహనాబాద్ ఆసుపత్రులకు తరలించారు. జెహనాబాద్ జిల్లా కలెక్టర్ అలంకృత పాడే, సబ్ డివిజినల్ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ కుమార్, మఖ్దూంపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దివాకర్ కుమార్ విశ్వకర్మ....ఇక్కడి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. మృతుల కుటుంబీకులకు సమాచారం తెలియజేశారు. అంచనాలకు మించిన స్థాయిలో భక్తులు ఆలయానికి తరలిరావడం.. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు ఆలయ కమిటీపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com