Crime : ట్రక్కు డ్రైవర్ కిడ్నాప్.. మరో వివాదంలో పూజా ఖేడ్కర్..

ఇటీవల ఐఏఎస్ ఉద్యోగం కోల్పోయిన పూజా ఖేడ్కర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కుటుంబానికి చెందిన కారును ఒక ట్రక్కు ఢీకొనగా, ఆ ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసిన ఘటనలో ఆమె పేరు తెరపైకి వచ్చింది.నవీ ముంబైలోని ఐరోలి సిగ్నల్ వద్ద ఒక కాంక్రీట్ మిక్సర్ ట్రక్కు, పూజా ఖేడ్కర్ కుటుంబానికి చెందిన కారును ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ట్రక్కు డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ (22) ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని పుణెకు తీసుకెళ్లారు. డ్రైవర్ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు దర్యాప్తు చేసి, సాంకేతిక ఆధారాలతో ఆ కారును పుణెలోని పూజా ఖేడ్కర్ ఇంటి వద్ద గుర్తించారు. డ్రైవర్‌ను రక్షించడానికి పోలీసులు పూజా ఖేడ్కర్ ఇంటికి వెళ్లగా, ఆమె తల్లి మనోరమ ఖేడ్కర్ పోలీసులను అడ్డుకున్నారు. వారికి సహకరించకుండా, గొడవకు దిగి, ఇంట్లోకి రావడానికి చాలాసేపు అనుమతించలేదు. చివరికి పోలీసులు లోపలికి వెళ్లి డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్‌ను రక్షించి నవీ ముంబైకి తిరిగి తీసుకొచ్చారు. ఈ ఘటనపై నవీ ముంబై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పూజా ఖేడ్కర్ తల్లిపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు మరో కేసు కూడా నమోదైంది. ఈ వివాదం పూజా ఖేడ్కర్ కుటుంబానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. గతంలో కూడా పూజా ఖేడ్కర్ తప్పుడు పత్రాలతో ఐఏఎస్ ఉద్యోగం పొందారని ఆరోపణలు రావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com