కిడ్నీ రాకెట్ దందా..బయటపెట్టిన TV5

కిడ్నీ రాకెట్ దందా..బయటపెట్టిన TV5
గుట్టు చప్పుడు కాకుండా ఇంటి పేరు మార్చి, ఏమార్చి కిడ్నీ దోచేసిన వైనాన్ని టీవీ5 బట్టబయలు చేసింది.

ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ దందా బట్టబయలైంది. గుట్టు చప్పుడు కాకుండా ఇంటి పేరు మార్చి, ఏమార్చి కిడ్నీ దోచేసిన వైనాన్ని టీవీ5 బట్టబయలు చేసింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని టార్గెట్‌ చేసి డబ్బులు ఎరగా చూపి కిడ్నీ రాకెట్ ముఠా ఎలా దందా చేస్తుందో ఆధారాలతో సహా టీవీ5 బయటపెట్టింది.ఏలూరు నగరానికి చెందిన అనురాధ అనే దళిత మహిళ ఒంటరిగా జీవిస్తోంది. కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మహిళ అప్పులతో బాధపడుతూ ఉంది. ఇదే అదునుగా రంగంలోకి దిగిన ప్రసాద్ అనే కిడ్నీ బ్రోకర్ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. బాధితురాలి ఆర్థిక ఇబ్బందులను టార్గెట్ చేసుకొని ఒక కిడ్నీ అమ్మితే ఏడు లక్షల డబ్బులు వస్తాయని ఆశ చూపాడు. మోసపూరిత మాటలు చెప్పి మహిళను కిడ్నీ రాకెట్‌లోకి లాగాడు.

కిడ్నీ అమ్మిన మహిళ ఆధార్ కార్డులో ఇంటి పేరు మార్చి కిడ్నీ కొనుగోలు చేసిన వ్యక్తి భార్యగా బాధితురాలిని చేర్చి దొంగ ఆధార్ కార్డును సృష్టించాడు. అయితే తన వద్ద నుంచి ఏడు లక్షలకు కిడ్నీ కొనేందుకు బేరమాడి తీరా కిడ్నీ ఇచ్చిన తర్వాత ఐదు లక్షల చేతిలో పెట్టారని ఒక లక్ష మెడికల్ ఖర్చులకే సరిపోయిందని బాధిత మహిళ బోరుమంటోంది. తీరా డబ్బులు అడిగినా తనను ఇబ్బందులకు గురిచేసి పరార్ అయ్యారని మహిళా ఆవేదన వ్యక్తం చేసింది. కిడ్నీ పోగొట్టుకున్న తాను అనారోగ్యం బారిన పడ్డానని కనీసం తనను ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీరు మున్నీరవుతోంది.

ఆధార్ కార్డులో పేరు మారడం వల్ల ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. తన పిల్లలను చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నానని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కిడ్నీ పోయి అటు అనారోగ్యం పాలై దిక్కుతోచని స్థితిలో ఉన్నానని, తనకు న్యాయం చేయాలని టీవీ5కి చెప్పి బోరుమంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story