సీతానగరం పుష్కరఘాట్‌లో అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్..!

సీతానగరం పుష్కరఘాట్‌లో అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్..!
ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్‌లో ప్రేమజంటపై దాడి, అత్యాచారం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ల విచారణ కొనసాగుతోంది.

ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్‌లో ప్రేమజంటపై దాడి, అత్యాచారం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ల విచారణ కొనసాగుతోంది. అరెస్టుపై ఇవాళ అధికారిక ప్రకటన చేయనున్నారు. రేపిస్ట్‌లు ఇద్దరికీ నేరచరిత్ర ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. గతంలో వీరు చేసిన అకృత్యాల్ని రాబట్టే పనిలో ఉన్నారు. ఈనెల 19న ప్రేమజంటపై దాడి తర్వాత వాళ్ల ఫోన్లు లాక్కున్న ఈ మృగాళ్లిద్దరూ.. పడవలో తాడేపల్లి వైపు పారిపోయారు. తర్వాత బకింగ్‌హమ్ కెనాల్‌ రైల్వే ట్రాక్ వద్ద మద్యం తాగి ఆపై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఏం జరుగుతోందో కూడా మీడియాలో వార్తలు చూసి తెలుసుకున్నారు. ఐతే.. చివరికి టెక్నాలజీ సాయంతో ఇద్దరి ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేశారు పోలీసులు. ప్రేమ జంట నుంచి లాక్కున్న ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో వీళ్లిదరూ దొరికారంటే అందుకు ఆ ఫోన్లే కారణం. ఘాట్‌లోని ఇసుక తిన్నెల్లో యువకుడిని తాళ్లతో కట్టేసి, ఆపై యువతిపై అత్యాచారం చేశాక.. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ వారి పోన్లు తీసుకెళ్లి వాటిల్లో ఒకదాన్ని అమ్మేశారు. దాన్ని కొనుగోలు చేసిన వాళ్లు ఫోన్ ఆన్ చేసేసరికి వెంటనే ట్రాక్ చేశారు పోలీసులు. ఆ ఫోన్ వాళ్లకు ఎలా వచ్చిందో ఆరా తీస్తే విజయవాడ వ్యక్తి 3 వేలకు అమ్మినట్టు బయటపడింది. అతన్ని ప్రశ్నిస్తే నిందితుల గుట్టు రట్టయ్యింది. అటు, ఈ కేసులో మరో ముగ్గురి ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులకు సహకరించిన వారిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.

రేప్ కేసులో అరెస్టైన ఇద్దర్లో ఒకడిది తాడేపల్లి కాగా మరొకడిది ప్రకాశం జిల్లాలోని చినగంజాం. వీళ్లపై తాడేపల్లి, బందరు పీఎస్‌లలో కేసులున్నాయి. రైల్వే పోలీస్ స్టేషన్‌లోనూ కేసులు నమోదయ్యాయి. బ్యారేజీ దగ్గర రైల్వే ట్రాకే అడ్డాగా వీళ్లు పలు అరాచకాలకు పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. దోచుకున్న సొమ్ముతో మద్యం తాగడం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ జల్సాలు చేస్తున్నట్టు తెలిసింది. అటు శనివారం అత్యాచారానికి పాల్పడ్డాక ఆదివారం నిందితులు ఇద్దరూ ఓ బార్‌కి వెళ్లారు. అక్కడ మద్యం తాగుతూ రాత్రి జరిగిన ఘటనపై చర్చించుకున్నారు. ఆ మాటలు పక్క టేబుల్‌లో కూర్చున్న ఓ కానిస్టేబుల్ చెవిలో పడ్డాయి. అప్రమత్తమై స్టేషన్‌ నుంచి నలుగురు కానిస్టేబుల్స్‌ని తీసుకుని వెళ్లే సరికే వారు అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే సెల్‌ఫోన్ సిగ్నల్‌ వారిని పట్టించింది.

ఇవాళ విచారణ పూర్తయ్యాక ఇద్దరినీ ఇవాళ మీడియా ముందుకు తీసుకురానున్నారు. ఈ కేసులో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు హోంమంత్రి కూడా ధృవీకరించారు. అటు.. ఈ కేసులో అరెస్టైన ఇద్దర్లో ఒకడు వారం కిందట తాడేపల్లిలో పోలీసులకు చిక్కాడు. అతిగా మద్యం తాగి హంగామా చేసిన ఘటనలో.. వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇది జరిగిన రెండ్రోజులకే పుష్కరఘాట్‌లో యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. గతంలోనూ వీరు ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారా.. ఈ బ్యాచ్‌తో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి అనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు.

Tags

Read MoreRead Less
Next Story