Kerala: కేరళలో కలకలం రేపిన ఇద్దరు రాజకీయ నాయకుల హత్యలు..

Kerala: కేరళలోని అలప్పుర జిల్లాలో ఇద్దరు రాజకీయ నాయకుల హత్యలు కలకలం రేపాయి. 12 గంటల వ్యవధిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీ K.S షాన్, బీజేపీ OBC మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. దీంతో అలప్పుజలో ఇప్పుడు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీగా మోహరించారు.
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీ K.S షాన్‌ను దారుణంగా చంపారు దుండగులు. పార్టీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న టైంలో షాన్ బైకును వ్యాన్‌తో ఢీ కొట్టారు గుర్తు తెలియని దుండగులు. కిందపడిపోయిన షాన్‌ను విచక్షణ రహితంగా కొట్టారు. గాయపడ్డ షాన్‌ను కొచ్చిలోని హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. హత్య వెనుక RSS హస్తం ఉందని SDPI నేతలు ఆరోపిస్తున్నారు.
షాన్ హత్య జరిగిన 12 గంటల వ్యవధిలోనే BJP ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు రంజిత్ శ్రీనివాస్‌ను హత్య చేశారు. షాన్ మృతికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలపై బీజేపీ, SDPI రెండు పార్టీలు పరస్పన ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఈ రెండు హత్యలను సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంజిత్ శ్రీనివాస్ హత్య వెనుక ఇస్లామిక్ టెర్రరిస్టు వాదులున్నారన్నారు కేంద్రమంత్రి మురళీధరన్.
హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేరళలో బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇదే మొదటిసారి కాదన్నారు. పాలక్కడ్‌లో ఇటీవలే బీజేపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడని గుర్తు చేశారు. ఐనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు మురళీధరన్. ఇస్లామిక్ టెర్రరిస్టులతో పినరయి సర్కార్ స్నేహం చేస్తోందన్నారు. దాడులు చేసేలా వారిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com