కారు డ్రైవింగ్‌లో కునుకు.. భార్యా బిడ్డలను కబళించిన మృత్యువు

కారు డ్రైవింగ్‌లో కునుకు.. భార్యా బిడ్డలను కబళించిన మృత్యువు
కారు డ్రైవ్ చేస్తూ అతడు తీసిన కునుకు కన్నబిడ్డని, కట్టుకున్న భార్యని దూరం చేసింది.

మృత్యువు నీడలా వెన్నంటే ఉంటుందంటారు. ఏ రూపంలో ఏ క్షణంలో అయినా రావొచ్చు. ఎలా ముంచుకొస్తుందనేది ఎవరూ ఊహించలేనిది. కారు డ్రైవ్ చేస్తూ అతడు తీసిన కునుకు కన్నబిడ్డని, కట్టుకున్న భార్యని దూరం చేసింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద సంఘటన బుధవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తిలో చోటు చేసుకుంది.

విశాఖ ఎంవీపీ కాలనీలో నివసిస్తున్న సింగునూరి శ్రీనివాసరావు విజయనగంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కావ్య, సుప్రజ అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సుప్రజ ఎండీ పూర్తి చేసి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. చిన్న కుమార్తె కావ్య విశాఖలో ఎంఎస్ సర్జన్ చేస్తోంది.

స్నేహితులను కలవడానికి వెళదామని కావ్య అనగా కొద్ది రోజుల క్రితం భార్యతో సహా బయల్ధేరారు శ్రీనివాస్. వచ్చేటప్పుడు అత్తగారి ఊరైన చెముడులంకలో నాలుగు రోజులు ఉండి విశాఖ బయలు దేరారు. బుధవారం ఉదయం 10 గంటలకు కారులో బయలు దేరారు.

మార్గమధ్యలో భోజనం చేసి ప్రయాణం కొనసాగించారు. ఈ క్రమంలో పులపర్తి సమీపంలోకి వచ్చేసరికి వాహనం నడుపుతున్న శ్రీనివాసరావుకు నిద్ర మత్తులో రెప్ప పడడంతో రోడ్డు పక్కన నిలిపి ఉన్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టారు. దీంతో వ్యాన్ వెనుక భాగంలోకి కారు చొచ్చుకుపోయింది. దీంతో పక్కన కూర్చున్న భార్య వెంకటలక్ష్మి సీటు బెల్ట్ ధరించని కారణంగా అక్కడికక్కడే కన్నుమూశారు. వెనుక సీటులో కూర్చున్న కుమార్తె కారు ఢీకొట్టిన తీవ్రతకు ముందు సీటులోకి దూసుకు రావడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును విశాఖ ఆసుపత్రి నుంచి చెముడులంకకు తీసుకువెళ్లారు. నిద్ర మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నామని సీఐ నారాయణరావు వివరించారు. శ్రీనివాసరావుకు కొడుకులు లేకపోవడం, ఆయన గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో పెద్ద కుమార్తె సుప్రజ.. తల్లికి, చెల్లికి గురువారం అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.

Tags

Read MoreRead Less
Next Story