Hyderabad : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. సరూర్‌నగర్‌లో దారుణం

Hyderabad : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. సరూర్‌నగర్‌లో దారుణం
X

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోదండరామనగర్‌కు చెందిన శేఖర్ అనే క్యాబ్ డ్రైవర్‌కు, చిట్టి తో 16 ఏళ్ల క్రితం నాగర్‌కర్నూల్‌లో వివాహమైంది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శేఖర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేయడానికి హైదరాబాద్‌ వచ్చారు. అదే ప్రాంతానికి చెందిన హరీశ్ తో చిట్టికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో శేఖర్ చిట్టిని పలుమార్లు మందలించారు. అయినప్పటికీ ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసుకుంది.

గురువారం రాత్రి శేఖర్ ఇంట్లో నిద్రిస్తుండగా, చిట్టి తన ప్రియుడు హరీశ్‌కు సమాచారం ఇచ్చి ఇంట్లోకి పిలిచింది. ఆ సమయంలో పిల్లలు ఇంట్లో లేరు. నిద్రలో ఉన్న శేఖర్‌ను హరీశ్ గొంతు నులమగా, చిట్టి డంబెల్‌తో తలపై బలంగా కొట్టింది. దీంతో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం ఈ విషయం తెలుసుకున్న స్థానికులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Tags

Next Story