క్రైమ్

ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. రూ.7 లక్షలు పోగొట్టుకున్నాక గానీ తెలిసింది ఆమె ఎవరో..

ఆ అపరంజి బొమ్మ అడిగినంత డబ్బూ పంపించాడు.

ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. రూ.7 లక్షలు పోగొట్టుకున్నాక గానీ తెలిసింది ఆమె ఎవరో..
X

అందంగా ఉన్నాడు.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.. ప్యాకేజ్ బాగానే ఉంది.. మ్యాట్రిమోనీలో పెట్టిన బయోడేటాను చూసి అతగాడిని ఓ పట్టుపడదామని కిలాడీ లేడీ ఫిక్సయిపోయింది. అందంగా లేకపోయినా అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి.. ఆ తెలివితోనే అందమైన మోడల్ ఫోటోలు గూగుల్ నుంచి డౌన్ లోడ్ చేసి.. నేనే.. అందంగా ఉన్నానా.. అంటూ అబ్బాయికి ఎరవేసింది.. చిలుక పలుకులు పలికింది.. ఇంకేముంది.. ఆమె అందానికి ఫిదా అయిపోయిన గుంటూరు చెందిన అమెరికా అబ్బాయి.. వెంటనే అమ్మానాన్నకు మెయిల్ పెట్టాడు.. పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా.. లేకపోతే లేదు అని చెప్పాడు. ఆ అపరంజి బొమ్మ అడిగినంత డబ్బూ పంపించాడు. తీరా అబ్బాయి కుటుంబం ఆమె గురించి ఆరా తీయగా గుట్టంతా బయటపడింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మొసపోయామని పోలీసలను సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గుంటూరు తెనాలికి చెందిన యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి కోసమని యువకుడు మ్యాట్రిమోనిలో వివరాలు నమోదు చేసుకున్నాడు. అవి చూసిన ఓ మాయలేడి అతడిని ఫోన్ లో సంప్రదించింది. తన పేరు సుముద్ర అని, ప్రకాశం జిల్లా ఉలవపాడు తన స్వగ్రామమని, న్యూయార్క్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని, తాను గ్రీన్ కార్డ్ హోల్డర్ నని పరిచయం చేసుకుంది. దీంతో ఆ యువకుడు ఆమె ఫోటోలు పంపమని అడగ్గా.. గూగుల్ నుంచి అందమైన మోడల్ ఫోటోలు పంపించింది. అవి చూసి ప్లాటపోయాడు.. పెళ్లికి ఫిక్సయిపోయాడు. ఆమె ఫోటోలు, బయోడేటా కుటుంబసభ్యులకు పంపాడు.

వాటిని చూసిన కుటుంబసభ్యులు ఆమె కుటుంబం గురించి గొప్పగా ఊహించుకున్నారు. యువతికి ఫోన్ చేసి మీ పెద్ద వాళ్లతో మాట్లాడతామన్నారు. దీంతో యువతి తన తల్లిదండ్రులు మద్రాస్ యూనివర్శిటీలో ఫ్రొఫెసర్ లుగా పని చేస్తున్నారని నమ్మించింది. తండ్రి పేరు శ్రీనివాస్ అని, తల్లి పేరు దేవి అని చెప్పింది. తండ్రి ఫోన్ నెంబర్ అని ఓ వ్యక్తి నెంబర్ ఇచ్చింది. కుటుంబసభ్యులు అతడితో ఫోన్ లో మాట్లాడారు. అమ్మాయి గ్రీన్ కార్డ్ హోల్డర్ అని నాయనమ్మకు బాలేకపోవడంతో చూసి పోదామని వచ్చింది.. వెళ్లేలోపు పెళ్లి చూపులు, పసుపు కుంకుమ పెట్టుకుందామని నమ్మించారు అబ్బాయి తల్లిదండ్రులను.

ఈ నెల 21న తమ స్వగ్రామం ఉలవలపాడుకు రావాలని, 24న పసుపు కుంకుమ పెట్టుకుందామని చెప్పారు. ఈ లోపు అమ్మాయికి బంగారం, బట్టలు కొనుగోలుకు సంబంధించి సమయం తక్కువగా ఉందని చెప్పి అకౌంట్ లో రూ.7 లక్షల 20 వేలు వేయించుకున్నారు. అంతా సవ్యంగానే జరిగిందని భావించి ఈ నెల 21న అమ్మాయి చెప్పిన ప్రకాశం జిల్లా ఉవలవపాడు గ్రామానికి అబ్బాయి కుటుంబసభ్యులు వెళ్లారు. అక్కడకు వెళ్లాక ఆ మాయలేడి ఇచ్చిన నెంబర్ కానీ, తండ్రి అని చెప్పిన వ్యక్తి నెంబర్ కానీ పని చేయ లేదు. స్విచ్ఛాఫ్ అని వచ్చింది.

ఉలవపాడు గ్రామం అంతా తిరిగి వాకబు చేశారు. ఆ పేరుతో తమ గ్రామంలో ఎవరూ లేరని మద్రాస్ యూనివర్శిటీ ఉద్యోగం చేసేవారు అంతకంటే లేరని చెప్పుకొచ్చారు గ్రామస్థులు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన అబ్బాయి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తెనాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వెనుదిరిగారు.

Next Story

RELATED STORIES